ఫార్మూలా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. దాదాపు 7 గంటల పాటు విచారణ సాగింది. ఉదయం పది గంటలకు ఏసీబీ కార్యాలయానికి వచ్చారు కేటీఆర్. తన న్యాయవాది రాంచందర్ రావుతో కలిసి విచారణకు హాజరయ్యారు. ఏసీబీ డీఎస్పీ మాజీద్ ఖాన్ ఆధ్వర్యంలో కేటీఆర్ ను ప్రశ్నించారు. దాదాపు 40 ప్రశ్నలకు కేటీఆర్ నుంచి సమాధానం రాబట్టారని తెలుస్తోంది. సాయంత్రం 5 గంటల సమయంలో ఏసీబీ కార్యాలయం నుంచి కేటీఆర్ బయటికి వచ్చారు.
ఏసీబీ కార్యాలయం నుంచి నేరుగా తెలంగాణ భవన్ వెళ్లారు కేటీఆర్.అక్కడ ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. పార్టీ నేతలతో మాట్లాడిన తర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయారు. తనపై పెట్టింది లొట్టపీసు కేసేనని మరోసారి చెప్పారు.
ఇన్వెస్టిగేషన్ లో నన్ను ఏం ప్రశ్నలు అడగాలో తెలియక ఏసీబీ అధికారులు ఇబ్బందులు పడ్డారని కేటీఆర్ అన్నారు.
ఈ కేసులో అవినీతి ఎక్కడుందని అధికారులను అడిగానని.. దీంతో అధికారులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు.
పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనబడ్డట్లు.. రేవంత్ రెడ్డి కి అందరూ దొంగలుగానే కనిపిస్తారని విమర్శించారు. తాను ఒక్క పైసా అవినీతి చేయలేదన్నారు కేటీఆర్. జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కి వస్తా.. ఓపెన్ గా కెమెరా పెట్టు.. ఈ కేసుపై చర్చిద్దామని కేటీఆర్ సవాల్ చేశారు. కావాలంటే లై డిటెక్టర్ పెట్టాలని అన్నారు.