
-
నగరంలో ఇంటర్న్ షిప్ చేస్తున్న ఝార్ఖండ్ యువతి.
-
రూముకు రావాలంటూ ఫ్రెండ్స్ రిక్వెస్ట్.
-
యువకుల మాటలు నమ్మి రూముకు వచ్చిన యువతి.
-
అనంతరం మధ్యం తాగించి అత్యాచారం.
-
నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.
-
రిమాండ్ విధించిన న్యాయస్థానం.
-
ఆలస్యంగా వెలుగులోకి ఘటన.
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : ఇటీవలి కాలంలో మహిళలపై అత్యాచారాలు పెరిగి పోయాయి. ఆడవాళ్ళు ఒంటరిగా కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. మరి కొందరు నమ్మించి అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. పక్కనే ఉండి మంచిగా మాట్లాడి… ఆపై అత్యాచారానికి ఒడిగడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. నమ్మి వెంట వచ్చిన స్నేహితురాలి పై ఇద్దరు యువకులు రేప్ చేశారు. హైదరాబాద్ లోని బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళితే… ఝార్ఖండ్ కు చెందిన 20 ఏళ్ల యువతి తమ రాష్ట్రంలోనే బయోమెడిసిన్ లాస్ట్ ఇయర్ చదువుతోంది. అదే రాష్ట్రానికి చెందిన 23 ఏళ్ల అజయ్, 22 ఏళ్ల హరితో ఆమెకు ఎప్పటినుంచో పరిచయం ఉంది. ఈ ఇద్దరు యువకులు బాచుపల్లి లోని హరిత వనం కాలనీలో ఉంటున్నారు. కాగా ఆ యువతి హైదరాబాద్ లోని ఓ హాస్పిటల్ లో ” ఇంటర్న్ షిప్ ” చేయడానికి ఝార్ఖండ్ నుంచి నగరానికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అజయ్, హరి పక్కా ప్లాన్ వేశారు. ఇందులో భాగంగానే ఆ యువతికి ఫోన్ చేసి తాము ఉంటున్న ప్రాంతానికి రావాలని కోరారు. మొదట్లో ఆ యువతి ఒప్పుకోలేదు. కానీ మెల్లగా ఒప్పించారు. దీంతో మే 3 వ తేదీన నిజాంపేట్ లోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో వారు అద్దెకు ఉంటున్న రూమ్ కు ఆమెను తీసుకొచ్చారు.
అనంతరం ఆ రూమ్ లో ముగ్గురు కలిసి మద్యం తాగారు. తాగిన తర్వాత నిద్రపోయారు. అయితే అర్ధరాత్రి సమయంలో అజయ్, హరి కలిసి ఆ యువతిపై అత్యాచారం చేశారు. దీంతో ఆ యువతి బెంబేలెత్తి పోయింది. వెంటనే వారి రూమ్ నుంచి తప్పించుకుని రూమ్ బయటకు వచ్చి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు గమనించి అత్యాచారానికి పాల్పడిన యువకులను పట్టుకున్నారు. ఆపై వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నిందితులకు రిమాండ్ విధించింది.