
-
జనమే తప్పు చేశారన్నట్టు అహంకారం
-
బీఆర్‌ఎస్ పదేళ్లలో హామీల వైఫల్యాన్ని ఏమనాలి?
-
గులాబీ పాలనలో స్కాముల సంగతేంటి?
-
గురువింద సామెతలా కేసీఆర్ మాటలు: విశ్లేషకులు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగంపై సొంత పార్టీ శ్రేణులతో పాటు ప్రత్యర్థి పార్టీలు కూడా జోరుగా విశ్లేషణ సాగిస్తున్నాయి. కేసీఆర్ ప్రసంగం కోసం తెలంగాణ సమాజమంతా ఎదురు చూస్తోందంటూ బీఆర్ఎస్ నేతలు హైప్ క్రియేట్ చేశారు. అయితే గులాబీ శ్రేణుల అంచనాల మేరకు కేసీఆర్ ప్రసంగం సాగిందా? 25 ఏళ్ల పార్టీ ఎత్తు పల్లాలపై సమీక్ష నుంచి భవిష్యత్తుకు బాటలు వేసిందా? అంటే భిన్నాభిప్రాయాలే వినిపిస్తున్నాయి. ఆత్మస్తుతి, పరనింద తరహాలోనే కేసీఆర్ ప్రసంగం సాగిందని, కాంగ్రెస్ హామీలను గుర్తు చేస్తూ ప్రభుత్వంపై విమర్శల దాడి తప్ప, కేసీఆర్ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
నేను చేస్తే న్యాయం… ఎదుటి వాడు చేస్తే అన్యాయం ! : కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటా ఫెయిల్ అంటూ కేసీఆర్ విమర్శలు చేసే క్రమంలో భూముల అమ్మకాల్లో ఏవి అమ్మాలో… ఏవి అమ్మకూడదో అన్న తెలివి కూడా లేదంటూ విమర్శించారు. యూనివర్సిటీ భూములమ్ముతారా అంటూ ప్రశ్నించారు. ఆయన సీఎంగా ఉండగానే అదే హెచ్‌సీయూ భూములను పలు సంస్థలకు కేటాయించిడం, ఓ దశలో ఉస్మానియా యూనివర్సిటీకి అంత భూమి ఎందుకంటూ తను చేసిన వ్యాఖ్యలను పలువురు గుర్తు చేస్తున్నారు. ఇక తన హయాంలో అమ్మిన భూముల సంగతి, ధరణి మాటున గల్లంతైన ప్రభుత్వ భూముల విషయం. ముఖ్యంగా ఎన్నికలకు ముందు సాగించిన కోకాపేట, మోకిల వంటి రూ.30 వేల కోట్ల విలువైన వేయి ఎకరాల భూ విక్రయాలు చర్చకు రాక తప్పదు. ఎన్నికలకు ముందు హడావుడిగా ఔటర్ టోల్ టెండర్ ఖరారు, గడువుకు 8 నెలల ముందుగానే మద్యం దుకాణాలకు కొత్త టెండర్ల వ్యవహారం కేసీఆర్ పాలనను ప్రశ్నిస్తూనే ఉంటాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓ దశలో ధరణిని తన పాలనకు రెఫరెండంగా చెప్పుకున్న కేసీఆర్, రజతోత్సవ సభలో దాని గురించి గాని, తాను ప్రపంచ అద్భుత నిర్మాణంగా ప్రచారం చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు కూలిన ఘటనపై గానీ ప్రస్తావనే చేయకపోవడం చూస్తే కేసీఆర్‌ది దాటవేత రాజకీయమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కృష్ణా, గోదావరి జలాల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం సాధించలేక పోతోందని గళమెత్తిన కేసీఆర్ రజతోత్సవ సభలో దాన్ని వల్లె వేయకపోవడం విస్మయపరచింది.
నాటి హామీలను మరచి విమర్శలు ! : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందన్న కేసీఆర్ వాటిని అమలు చేయలేక చతికిలపడిందంటూ విమర్శించారు. అదే సమయంలో తన ఉద్యమ కాలంతో పాటు పదేళ్ల తన ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీల అమలు అంశం ఎందుకు మర్చిపోయారన్న ప్రశ్న ఎదుర్కొనక తప్పదు. ప్రధానంగా దళిత సీఎం… దళితులకు 3 ఎకరాల భూమి… కేజీ టూ పీజీ ఉచిత విద్య… నిరుద్యోగ భృతి… మైనారిటీలకు 12%, గిరిజనులకు 10% రిజర్వేషన్లు వంటి హామీలు జనానికి గుర్తు రాక మానవు. ఇక సరిగ్గా ఎన్నికల ముందే తెచ్చిన బంధు పథకాలు ఆయన ఓట్ల పథకాలు గానే చూడక తప్పదు. అలాంటప్పుడు కాంగ్రెస్ హామీల అమలు వైఫల్యమే ఓ భారీ తప్పిదమన్నట్లుగా చెప్పడం కేసీఆర్ లాంటి నేత నుంచి వచ్చిన ఫక్తు రాజకీయ విమర్శలేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ హామీల అమలుకు ఇంకా మూడున్నర ఏళ్ల సమయం ఉందన్నది ఇక్కడ గమనార్హం. కేసీఆర్ చెబుతున్నట్లుగా కాంగ్రెస్ హామీలను చూసే జనం వారికి ఓటేశారా ? అంటే అది నిజంగా స్వీయ తప్పిదాలను కప్పిపుచ్చడమే అవుతుంది. కాంగ్రెస్ హామీల కంటే ఎక్కువగా కేసీఆర్ పదేళ్ల పాలన పైన వ్యతిరేకతతో పాటు ఆ నాటి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన ఉన్న వ్యతిరేకతనే పార్టీ ఓటమికి దారి తీసిందన్న విశ్లేషణల సంగతేంటి ?
తన హయాంలో అవినీతి సంగతేమిటో ! : పదేళ్ల పాలనలో అంతా సవ్యంగా సాగిందంటూ ఆత్మస్తుతి సాగించిన కేసీఆర్ కాంగ్రెస్ 15 నెలల పాలనలో తెలంగాణంతా నాశనమైపోయిందంటూ బాధపడ్డారు. కాంగ్రెస్ పాలన అంతా కమిషన్లు, అవినీతి అంటూ విమర్శలు చేశారు. అయితే కేసీఆర్ పదేళ్ల పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో, విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన అవినీతి పైన సాగుతున్న విచారణలు, ఫార్ములా ఈ రేసు, గొర్రెల స్కామ్, సీఎంఆర్ఎఫ్ స్కామ్, టూరిజం స్కామ్, ధరణి స్కామ్, దళిత బంధు స్కామ్, చేప పిల్లల పంపిణీ స్కామ్ అంశాలు బీఆర్ఎస్ పదేళ్ల పాలన అవినీతిని నేటికీ సజీవంగానే నిలిపాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
పోలీస్ శాఖ దుర్వినియోగం లో ఎవరెంత ! : పోలీసులు అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతున్నారనేది కేసీఆర్ చేసిన మరో విమర్శ. ఇందులోకి వెళితే కేసీఆర్ వ్యవహారం గురివింద గింజ సామెతను తలపిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ పోలీస్ శాఖను ఏ ప్రభుత్వం దుర్వినియోగం చేయలేనంత గా… కేసీఆర్ దుర్వినియోగం చేశారన్నది బాధిత రాజకీయ వర్గాలకు బాగా అవగతమే. కేసీఆర్ లాగా పోలీస్ శాఖను వాడితే తెలంగాణ ఉద్యమాన్ని సమైక్య పాలకులు విజయవంతంగా అణచివేసి ఉండేవారేమోనంటారు. కేసీఆర్ పాలనను ప్రశ్నిస్తూ చేసిన ప్రతిపక్షాల ఆందోళనలపై పోలీసులను ప్రయోగించి గృహ నిర్బంధాలు… ధర్నా చౌక్ ఎత్తివేయడం… ఉద్యోగాలు పైన, పరీక్ష పత్రాల లీకేజీల పైన ఉద్యమించిన విద్యార్థులు, నిరుద్యోగుల పైన… ఆర్టీసీ ఉద్యమం పైన అణచివేతకు పాల్పడటం కేసీఆర్ మర్చిపోయినా… జనం, రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, విద్యార్థులు, నిరుద్యోగులు మర్చిపోలేదు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పోలీసు శాఖ దుర్వినియోగం లో కేసీఆర్ పరాకాష్టకు నిలువెత్తు నిదర్శనం. మొయినాబాద్ ఫాం హౌస్ ఎపిసోడ్ తో కేసీఆర్ సాగించిన విన్యాసం… కోదండరామ్, బండి సంజయ్, రేవంత్ రెడ్డి ల పై అనుసరించిన నిర్బంధం పోలీసు శాఖ దుర్వినియోగానికి నిదర్శనాలు. ఇక మావోయిస్టులతో శాంతి చర్చలకు కేసీఆర్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేదికగా మద్దతు పలకడం రాజకీయ ఎత్తుగడ గానే విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. తాను హయాంలో ఎన్ కౌంటర్లు జరగలేన్నట్లుగా కేసీఆర్ మావోయిస్టులపై ప్రేమ చూపించడం ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లను ఇరకాటం లోకి నెట్టే ఎత్తుగడ గానే విశ్లేషకులు భావిస్తున్నారు.
కొరవడిన ఆత్మ విమర్శ ! : ఇకపోతే 25 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం రజతోత్సవ సభ వేళ పార్టీ జయాపజయాలపై పోస్టుమార్టం కరువై కేవలం బహిరంగ సభకు… అది కూడా ఏక వ్యక్తి కేసీఆర్ ప్రసంగానికే పరిమితమవ్వడం ఆ పార్టీ సంస్థాగత… సైద్ధాంతిక… ప్రజాస్వామిక బలహీనతలకు నిదర్శనంగా కనిపించిందంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే కుటుంబ పార్టీగా మారిన బీఆర్ఎస్ పార్టీకి రజతోత్సవ వేళ కూడా పార్టీ ప్రస్థానం పైన.. నిర్మాణ పరంగా ప్లీనరీ తరహా సమావేశాలు… సమీక్షలు లేకపోవడంతో పార్టీ పరాజయానికి ఆత్మవిమర్శ లోపించినట్టయింది.
నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి, పార్లమెంటు ఎన్నికల్లో సున్నా స్థానాలకు కారణాలపై కేసీఆర్ ప్రసంగంలో ఊసు కరువైంది. పైగా అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో సగం వరకు మార్చాలన్న నివేదికలను పట్టించుకోకుండా నన్ను చూసి ఓటేస్తారన్నట్లుగా ఎన్నికలకు వెళ్ళి పరాజయం పాలయ్యారు. ఇప్పటికీ ఆనాటి సిట్టింగ్ ఎమ్మెల్యేల తోనే పార్టీని నియోజకవర్గాల్లో నడిపిస్తున్నారు. రజతోత్సవ వేదిక పై కూడా అంతా పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన గులాబీ నేతలే దర్శనమిచ్చారు. అది చూసిన వారికి బీఆర్ఎస్ లో కొత్త నాయకత్వం… కొత్త ముఖాలు ఎప్పుడోనని ఎదురుచూస్తూ నిట్టూర్చకతప్పదు.