జాతీయం

దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు.. మోడీ సంచలనం

బీజేపీ ప్రభుత్వం మరో సంచలనం దిశగా అడుగులు వేస్తోంది. గత పదేళ్ల మోడీ పాలనలో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. వన్ నేషన్.. వన్ ట్యాక్స్ విజయవంతమైంది. వన్ నేషన్- వన్ రేషన్ దిశగా అడుగులు పడ్డాయి. వివాదాస్పద 360 ఆర్టికల్ రద్దైంది. ట్రిపుల్ తలాక్ బిల్లుకు తలాక్ చెప్పేశారు. అయోధ్యలో రామమందిరం నిర్మించారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది మోడీ సర్కార్. ఎంతో కాలంగా చర్చ సాగుతున్న వన్ నేషన్- వన్ ఎలక్షన్ దిశగా కార్యాచరణ వేగవంతం చేసింది. దేశంలో జమిలీ ఎన్నికలకు మోడీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. రానున్న శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టనుంది.

వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌ ప్రతిపాదన కోసం రామ్‌నాథ్‌ కోవింద్‌‌ సహా 8 మంది సభ్యులతో కూడిన కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది.లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై కమిటీ సభ్యులతో రామ్‌నాథ్ కోవింద్ చర్చించారు. ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీల అభిప్రాయాలను, రాష్ట్రాల సవాళ్లను కమిటీ పరిశీలించింది. సుదీర్ఘ చర్చోపచర్చల అనంతరం రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో మూడు దఫాలు జమిలీ ఎన్నికలే జరిగాయి.తర్వాత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోవడం వంటి ఘటనలతో జమిలీ ఎన్నికలకు బ్రేక్ పడింది. దేశంలో జమిలీ ఎన్నికల ప్రతిపాదనకు మళ్లీ 1980లో బీజం పడింది. జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ మే 1999లో తన 170వ నివేదికలో లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరగాలని అభిప్రాయపడింది. అందుకు తగినట్లే కేంద్రంలోని బీజేపీ సర్కార్ అధ్యయనానికి కమిటీ వేసి.. అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను తీసుకుని కేంద్రానికి నివేదిక ఇచ్చింది.

అయితే జమిలీ ఎన్నికలు భారత్ లాంటి పెద్ద దేశంలో సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జమిలీ ఎన్నికల నిర్వహణతో జరిగే లాభ, నష్టాలేంటి.. జమిలీ ఎన్నికలకు దేశంలోని అన్ని పార్టీలు ఒప్పుకుంటాయా.. సాంకేతిక పరిజ్ఞానం సరిపోతుందా.. జమిలీ ఎన్నికలు ఒక పార్టీకీ అనుకూలంగా మారే ప్రమాదం ఉందా.. ప్రజల అభిప్రాయాలను జమిలి ప్రభావితం చేసే అవకాశం ఉందా అన్న చర్చలు అలాగే మిగిలిపోయాయి. ఒక వేళ జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అన్నదానిపై బిల్లు వచ్చాకే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Back to top button