ఐ-ప్యాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ దాడుల సందర్భంగా సీఎం మమతా బెనర్జీ వ్యవహరించిన తీరుపై బీజేపీ, కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సోదాలు జరుగుతున్న చోటుకి సీఎం వెళ్లి, ఫైల్స్ ఎత్తుకెళ్లడం ఏంటని ప్రశ్నించాయి. బెంగాల్ లో గెలిచేందుకు టీఎంసీ, ఐ-ప్యాక్ తో కలిసి కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించాయి.
టీఎంసీ కళ్లు, చెవులు ఐ-ప్యాక్- కాంగ్రెస్
ఐ-ప్యాక్ సంస్థ టీఎంసీకి కళ్లు, చెవులుగా మారిందని కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌధరి ఆరోపించారు. ఆ సంస్థ బెంగాల్లో టీఎంసీ గెలుపు కోసం రాజకీయంగా అనైతిక, కుట్ర కార్యకలాపాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఒక కార్పొరేట్ సంస్థలో ఈడీ దాడులు చేస్తుంటే మమతాబెనర్జీ ఎందుకంత ఆందోళన చెందుతున్నారని ప్రశ్నించారు. ఆమెకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వస్తాయనే రైడ్స్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి ఫైల్స్ ఎత్తుకెళ్లిందని ఆరోపించారు.
మమతపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్న బీజేపీ
ఈడీ దాడులు జరుగుతుండగా ప్రతీక్ జైన్ నివాసానికి సీఎం మమతాబెనర్జీ వెళ్లడాన్ని బీజేపీ తప్పుపట్టింది. ఇది దర్యాప్తులో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడమే అవుతుందని బెంగాల్ ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు సువేందు అధికారి అన్నారు. ఇలాంటి ప్రవర్తన అనైతికమని మండిపడ్డారు. ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల విధులకు ఆటంకం కలిగించడం ఆమెకు కొత్తేమీ కాదని.. ఇది అలవాటుగా మారిందని చెప్పారు. సీఎంపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని దర్యాప్తు సంస్థలను కోరారు. లేకపోతే రాష్ట్ర ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు.
ఇంట్లో చోరీ జరిగిందంటూ ప్రతీక్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు
అటు ఈడీపై ప్రతీక్ జైన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంట్లో విలువైన పత్రాలను ఈడీ చోరీ చేసిందంటూ జైన్ భార్య ఆరోపించారు. సోదాల అనంతరం ఈడీ అధికారులు మధ్యాహ్నం 3 గంటలకు జైన్ ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆ వెంటనే జైన్ భార్య స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి.. అత్యవసరమైన పత్రాలను ఈడీ చోరీ చేసినట్లు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిందని, విచారణ జరుపుతామని పోలీసులు వెల్లడించారు.





