
ఐకాన్ స్టార్, పుష్ప హీరో అల్లు అర్జున్ కు కష్టాలు మరింతగా పెరుగుతున్నాయి. ఆయన షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. సంధ్య థియేటర్ ఘటనలో అల్లుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. హైకోర్టు తీర్పును పోలీసులు సవాల్ చేయబోతున్నారు. ఇదిలా ఉండగానే అల్లు అర్జున్ పై పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. పుష్ప 2 సినిమాపై మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు.
పుష్ప 2 సినిమా పై మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. పుష్ప సినిమాలో కొన్ని సన్నివేశాలు దారుణంగా ఉన్నాయని చెప్పారు. పోలీసుల పట్ల చిన్నచూపు చూసే విధంగా సీన్లు ఉన్నాయని.. గంధపు చెక్కల స్మగ్లర్ పెద్ద హీరోగా వచ్చి పోలీస్ ఆఫీసర్ ను కొట్టడం సరికాదన్నారు. కారును ఢీ కొట్టడంతో పోలీస్ ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్ లో పడిపోయిన తర్వాత ఏకంగా స్విమ్మింగ్ పూల్ లోనే హీరో అల్లు అర్జున్ ఉచ్చ పోయడం పోలీసులను చాలా అవమానించడమేనని తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. ఈ సీన్ తీసిన డైరెక్టర్ సుకుమార్, ప్రొడ్యూసర్ మరియు సినిమా హీరో అల్లు అర్జున్ పైన చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో కోరారు తీన్మార్ మల్లన్న. చట్టరీత్యా ఆ సీన్ కట్ చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసులను కించపరిచే అలాంటి సీన్లకు సెన్సార్ బోర్డు ఎందుకు అనుమతి ఇస్తుందని తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. సెన్సార్ బోర్డులో ఏం జరుగుతుంది.. సమాజానికి సినిమాలు ఏం మెసేజ్ ఇస్తున్నాయని నిలదీశారు. తెలంగాణ ప్రజలకు మరియు భారతదేశ ప్రజలకు స్మగ్లర్లే హీరోలాగా చూపిస్తే నేటి యువత అదే చెడు మార్గంలో వెళ్లే ప్రమాదం ఉందన్నారు. ఇది సమాజాన్ని నాశనం చేయడం కాదా అని మలన్న ప్రశ్నించారు. ఇటువంటి సినిమాలను ప్రోత్సహించకుండా మంచి సినిమాలను ప్రోత్సహించి పదిమందికి ఉపయోగపడే సినిమాలను మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి సినిమాలు తీసిన దర్శక నిర్మాతలు యాక్టింగ్ చేసిన హీరోల పైన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు తీన్మార్ మల్లన్న.