తెలంగాణలో జరుగుతున్న సమగ్ర కుల గణన సర్వేపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దాదాపు 75 ప్రశ్నలను సర్వేలో పొందుపరిచారు. కుటుంబానికి సంబంధించిన 75 అంశాలపై వివరాలు సేకరించడం సర్వే సిబ్బందికి సమస్యగా మారింది. ముఖ్యంగా ఆస్తులకు సంబంధించిన వివరాలు అడిగితే జనాలు తిరగబడుతున్నారు. కుల సర్వేలో ఆస్తుల వివరాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. దీంతో సర్వే చేస్తున్న సిబ్బంది సర్వే చేయకుండానే వెనుదిరిగి రావాల్సి వస్తోంది.
సర్వేలో ప్రభుత్వం తీసుకుంటున్న వివరాలు.. వాళ్లు అడుగుతున్న ప్రశ్నలు గందరగోళంగా ఉన్నాయి. మీ కుటుంబానికి అప్పు ఉందా? ఎందుకు అప్పు చేశారు? అప్పు ఎక్కడి నుంచి చేశారు? ఇంకా చెల్లించాల్సిన అప్పు ఎంత? అనే ప్రశ్నలు ఉన్నాయి. వీటిపై జనాలు మండిపడుతున్నారు. మా అప్పు గురించి మీకెందుకు అంటూ ఆగ్రహానికి గురవుతున్నారు. అంతేకాదు మీ ఇల్లు ఏ రకం?ఇంటి గోడలు దేనితో కట్టారు? ఇంటికి కరెంటు ఉందా?
మరుగుదొడ్డి ఉందా? అంటూ ప్రశ్నలు ఉండడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.