తెలంగాణ

కుటుంబ సర్వేకు ఆటంకాలు సృష్టిస్తే కఠిన చర్యలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుల గణన సర్వే ముమ్మరంగా సాగుతోంది. ప్రభుత్వం నియమించిన సిబ్బంది ఇంటింటికి వెళ్లి సమగ్ర కుటుంబ వివరాలు సేకరిస్తున్నారు. అయితే పలు ప్రాంతాల్లో సర్వేకు కొందరు ఆటంకాలు కల్పిస్తున్నారు. దీంతో సమగ్ర సర్వేపై సంచలన ప్రకటన చేశారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.

తమ అధినేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక సమగ్ర కుటుంబ సర్వేకు ఆటంకాలు కల్పించినా, ప్రజల్లో అపోహలు సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హెచ్చరించారు. గత ప్రభుత్వం చేయించిన కుటుంబ సర్వే వివరాలు ఉండగా ప్రత్యేకంగా మళ్లీ ఎన్యూమరేషన్ అవసరమా అని బీఆరెస్ నేతలు ప్రశ్నిస్తున్నారని, ఆ వివరాల మదింపు అప్పటి పాలకులు కోరుకున్న విధంగా జరిగిందని శుక్రవారం నాడు ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు.

సామాజిక, ఆర్థిక, విద్య, సమగ్ర కులగణన అనగానే గులాబీ, కమలం పార్టీలు ఆందోళన చెందుతున్నాయని, బలహీన వర్గాలకు న్యాయం జరగరాదన్నదే ఆ పార్టీల అభిమతమని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. 2011 తర్వాత పదేళ్లలో, 2021 లో జనాభా లెక్కలు సేకరించాల్సి ఉండగా మూడేళ్లయినా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దాటవేస్తోందని శ్రీధర్ బాబు అన్నారు. అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం, రాజకీయ ప్రాధాన్యత, ఆర్థిక తోడ్పాటు అందించడానికే కుటంబ సర్వే చేపడుతున్నామని ఆయన వివరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మేలు జరిగే ఈ ఎన్యూమరేషన్ ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఆరెండు పార్టీలు ప్రజలకు జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు.

జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ ఫలాలు అందరికీ చేర్చాలనే ప్రభుత్వ ఆశయాన్ని గుడ్డిగా ఎందుకు తప్పు పడుతున్నారని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. పింఛన్లు, రేషన్ కార్డులు తొలగించడానికే వివరాలు సేకరిస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో ప్రజలకు తెలుసునని ఆయన వెల్లడించారు. గణన తర్వాత అర్హత ఉన్నా సామాజిక ప్రయోజనాలు అందని వారికి మేలు జరుగుతుందని తెలిపారు. కులగణను స్వాగతించి, హర్షం వ్యక్తం చేస్తే మీకు రాజకీయ మనుగడ ఉంటుందని ఆయన బీఆరెస్, బీజెపీ పెద్దలకు సూచించారు. ఎన్యుమరేషన్ జరిగే సమయంలో ప్రజలు ఇళ్లవద్దే ఉండి సహకరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button