
ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు మరింత ముదురుతోంది. ఇప్పటికే మూడు గ్రూపులుగా విడిపోయింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ వర్గాలను దగ్గరికి తీస్తుండగా.. సీనియర్ నేత జానారెడ్డి సైతం సైలెంట్ గా పావులు కదుపుతున్నారు. వీళ్ల ముగ్గురిలో తానేం తక్కువంటూ తనకున్న పాత పరిచయాలంతో తన టీంను బలోపేతం చేసుకుంటున్నారు శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన కొత్తలో నేతలంతా కలిసి పనిచేసినా.. రోజులు గడుస్తున్న కొద్ది సీన్ మారిపోయింది. గత రెండు నెలలుగా పరిస్థితి మరింత దిగజారిందని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య వార్ పెరిగిపోతుందని తెలుస్తోంది.
తాజాగా యాదాద్రి సాక్షిగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్జి వెంకట్ రెడ్డి కయ్యానికి కాలు దువ్వుతున్నారు. వైటీడీ బోర్డుపై తమ వర్గం వారి పెత్తనం కోసం తీవ్ర పోటీ పడుతున్నారు. ఇద్దరు మంత్రుల్లో ఎవరూ తగ్గే సూచనలు లేకపోవడంతో యాదాద్రి బోర్డు ఏర్పడి 2 నెలలు అవుతున్నా చైర్మన్, కమిటీ సభ్యులు ఇంకా ఖరారు కాలేదు. వైటీడీ బోర్డు చైర్మెన్ గా తన మనిషే చైర్మన్‌గా ఉండాలని పట్టుబడుతున్నారు సీనియర్ మంత్రులు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేస్తే ఊరుకునేది లేదని తేల్చి చెబుతున్నారు ఇద్దరు మంత్రులు. దీంతో పార్టీ పెద్దలు కూడా ఏం చేయలేక మౌనంగా ఉంటున్నారని తెలుస్తోంది.
ఇద్దరు సీనియర్ మంత్రులు పంతం పట్టడంతో..ఇద్దరి మధ్యలో వేలు పెట్టడానికి భయపడుతున్నారు ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్ నాయకులు. వైటీడీ బోర్డులో తమ మనుషులు ఉండాలని జానా రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కొన్ని పేర్లు సూచించారని తెలుస్తోంది. జిల్లాలోని ఎమ్మెల్యేలు కూడా తమ బంధువుల పేర్లను ప్రతిపాదించారని అంటున్నారు. నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో వైటీడీ బోర్డు ఏర్పాటు వాయిదా పడుతూ వస్తోంది. దీంతో అభివృద్ధిలో వెనుకబడుతోంది యాదాద్రి ఆలయం.