
సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో చోటుచేసుకున్న ఓ హృదయవిదారక ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కాలేజీకి కేవలం అరగంట ఆలస్యంగా వచ్చినందుకు ఓ ఇంటర్ విద్యార్థినిని తోటి విద్యార్థుల ముందు లెక్చరర్లు అవమానకరంగా మాట్లాడటం చివరకు ఆమె ప్రాణాలకే ముప్పుగా మారింది. లెక్చరర్ల మాటలతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ బాలిక.. అదే ఒత్తిడిలో బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టడంతో కన్నుమూసింది.
మారేడుపల్లికి చెందిన 17 ఏళ్ల బాలిక ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో ఫస్టియర్ చదువుతోంది. గురువారం కాలేజీలో ఇంటర్నల్ పరీక్షలు నిర్వహించారు. అయితే, ఆ రోజు ఆమె పీరియడ్స్‌కు సంబంధించిన తీవ్రమైన శారీరక సమస్యలతో బాధపడుతూ సుమారు 40 నిమిషాలు ఆలస్యంగా కాలేజీకి చేరుకుంది. ఆలస్యం కావడంపై లెక్చరర్లు కారణం అడగగా, తాను నెలసరి సమయంలో ఎదుర్కొనే ఇబ్బందుల వల్లే ఆలస్యం అయిందని నిజాయితీగా సమాధానం చెప్పింది.
అయితే, ఆ సమాధానాన్ని అర్థం చేసుకోవాల్సింది పోయి.. సదరు లెక్చరర్లు తోటి విద్యార్థుల ముందే అత్యంత అవమానకరంగా ప్రశ్నించారు. నువ్వు పీరియడ్స్‌లో ఉన్నావని చెప్పడానికి నీ దగ్గర ఏమైనా రుజువు ఉందా అంటూ ప్రశ్నించడంతో బాలిక తీవ్రంగా కుంగిపోయింది. స్నేహితులు, సహ విద్యార్థినుల ముందు ఇలా మాట్లాడటం ఆమెకు తట్టుకోలేని అవమానంగా మారింది. ఇదే కాకుండా, ఆలస్యం కారణంగా ఆమెకు పరీక్ష రాయడానికి కూడా అనుమతి నిరాకరించారు. అప్పటికే మానసికంగా కుంగిపోయిన ఆ బాలిక మరింత మనస్తాపానికి గురైంది. కాలేజీ నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పి కన్నీళ్లతో కూలిపోయింది. అదే సమయంలో ఆమె స్పృహ కోల్పోయి ఒక్కసారిగా కింద పడిపోయింది.
భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను మల్కాజిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అప్పటికే బాలిక ఎడమ చేయి, ఎడమ కాలు పని చేయని స్థితికి చేరుకున్నాయి. వైద్యులు స్కానింగ్ పరీక్షలు నిర్వహించగా, తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా ఆమె మెదడులో రక్తం గడ్డకట్టినట్లు నిర్ధారించారు. గాంధీ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి అదుపులోకి రాలేదు. చికిత్స పొందుతూనే గురువారం అర్ధరాత్రి బాలిక మృతి చెందింది. కేవలం అవమానపరిచే మాటలే ఆ విద్యార్థినిని ప్రాణాంతక పరిస్థితికి నెట్టిందని వైద్యులు పేర్కొనడం ఈ ఘటన తీవ్రతను మరింత స్పష్టం చేస్తోంది.
ఈ ఘటనపై ఆ బాలిక తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమార్తె మృతికి బాధ్యులైన లెక్చరర్లను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కాలేజీ ఎదుట ధర్నాకు దిగారు. ఈ ఆందోళనకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా మద్దతుగా నిలిచారు. మహిళా విద్యార్థినుల పట్ల ఇలాంటి అమానుష ప్రవర్తనను సహించబోమని వారు నినాదాలు చేశారు. ఘటనపై మారేడుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లెక్చరర్ల ప్రవర్తనపై విచారణ జరుగుతోందని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ALSO READ: GOOD NEWS: ఈ రోజు వీరికి భారీగా డబ్బులు





