మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైన్ షాపు సిట్టింగ్ రూంలోకి వెళ్లారు. అవును మీరు చదివింది నిజమే. వైన్ షాపు సిట్టింగ్ రూంలో రాజగోపాల్ రెడ్డిని చూసి అక్కడ మందు తాగుతున్న లిక్కర్ బాబులు షాకయ్యారు. ఎమ్మెల్యే సిట్టింగ్ రూంలో ఉండటం ఏంటనీ పరేషాన్ అయ్యారు.
మునుగోడులో పర్యటించిన ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి.. వైన్ షాపులను కూడా ఆకస్మికంగా తనిఖీ చేశారు. నకిలీ మందు అమ్ముతున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో లిక్కర్ బాటిల్స్ ను పరిశీలించి షాపు నిర్వాహకులతో ఆరా తీశారు. అంతేకాదు వైన్స్ పక్కనే ఉన్న పర్మిట్ రూములను కోమటిరెడ్డి పరిశీలించారు. సిట్టింగ్ రూంలో ఉదయాన్నే మద్యం తాగుతున్న మందు బాబులకు క్లాస్ పీకారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఉదయాన్నే పర్మిట్ రూంలలో కూర్చుంటే కుటుంబ పరిస్థితి ఏంటని సీరియస్ అయ్యారు.
తాగుబోతులను సిట్టింగ్ రూం నుంచి బయటికి పంపించారు రాజగోపాల్ రెడ్డి. ఉదయం పూట పర్మిట్ రూముల్లోకి ఎవరికి అనుమతి ఇవ్వొద్దంటూ వైన్ షాపుల యజమానులకు వార్నింగ్ ఇచ్చారు. బెల్ట్ షాపులకు మద్యం అమ్ముతున్నారా అంటూ ఆరా తీశారు. బెల్డ్ షాపులకు మద్యం విక్రయిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో మద్యం అమ్మకాలు జరగకుండా కట్టడి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.