తెలంగాణ

ప్రపంచంలోనే అద్భుతమైన పూల పండుగ బతుకమ్మ.. తెలంగాణకు ప్రతీక

తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండుగ సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. బతుకమ్మ పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ.తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది.

బతుకమ్మ పండుగపై ఎన్నో కథలు, పురాణాలు చరిత్రలో ఉన్నాయి. నవాబులు, భూస్వాముల పెత్తందారీతనంలో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి ‘బతుకవమ్మా’ లేదా ‘బతుకు అమ్మా’అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో” పాటల వెనుక ఉండే మర్మం ఇదే.

బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ. ప్రపంచమంతా పూలతో దేవుడినిపూజిస్తే ఆ పూలనే పూజించే అరుదైన సంస్కృతి తెలంగాణలో బతుకమ్మగా బతికున్నది. ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయలలో పూసి ఉంటాయి. వీటిలో గునుగు పూలు, తంగేడు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నందివర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం.

తొమ్మిది రోజుల బతుకమ్మ నైవేద్యాలు

మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ.. మహా అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు మొదలవుతుంది. పెత్తరామస అని కూడా అంటారు. 9 రోజులపాటు ప్రతిరోజూ ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ, ఆశ్వయుజ అష్టమి నాడు అదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరన్నం, నువ్వులన్నం. తొమ్మిదిరోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు.

ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగిసే పండుగ
తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని ఈ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు. ఈ తొమ్మిది రోజులలో వీరు రోజూ బతుకమ్మలు చేసి, ప్రతిసాయంత్రం వాటి చుట్టూ తిరుగుతూ ఆడతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు. చివరి రోజు బతుకమ్మ (సద్దుల బతుకమ్మ) పండుగ అత్యంత మనోహరంగా ఉంటుంది. బతుకమ్మను పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరీ మాతను పెడతారు. సాయంకాలం అందరూ తమ తమ బతకమ్మలతో ఒక చోట చేరి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరీ దేవిని కీర్తిస్తూ ఆడవారు పాడతారు. ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఆపై ఇంటి నుంచి తీసుకువచ్చిన పెరుగన్నం, సత్తుపిండిలను ఇచ్చి పుచ్చుకొని తింటారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆడపడుచులు అంతా సంబరంగా జరుపుకునే వేడుక. బంధాలను, అనుబంధాలను గుర్తు చేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ. ఇదో పూల పండుగ, ప్రకృతిని పూజించే పండుగ. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో గొప్పది. ఉద్యమంలో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు.

తెలంగాణ ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు తెలిపేలా బతుకమ్మ పాటలను పాడతారు. బతుకమ్మ పాటలలో పురాణ, ఇతిహాస కథలు మొదలుకొని తెలంగాణ వీరుల కథలు, జానపద ఇతివృత్తాలు కూడా ఉంటాయి. బతుకమ్మ పాటల్లో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబిస్తుంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాడే పాటలు మొదలుకొని ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయె చందమామ, కోసలాదేశుండు నుండి ఉయ్యాలో దశరథ రాముండు ఉయ్యాలో, చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ అంటూ పాటలు పాడుతారు మహిళలు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button