తెలంగాణరాజకీయం

ఖైరతాబాద్‌కు త్వరలో బైపోల్.. దానం నాగేందర్ మళ్లీ గెలిచేనా?

తెలంగాణలో త్వరలో ఉప ఎన్నిక రాబోతోందని తెలుస్తోంది. ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం ఖాయమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాలుగు నెలలకే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంతేకాదు పార్లమెంట్ ఎన్నికల్లో దానం కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థిగా సికింద్రాబాద్ స్థానం నుంచి బరిలో నిలిచారు.ఇదే ఇప్పుడు దానం నాగేందర్‌కు పెద్ద సమస్యగా మారింది.పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత ప్రకటించాలని ఇప్పటికే బీఆర్ఎస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై ఇటీవల స్పందించిన హైకోర్టు నెల రోజుల్లో స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. వారిలో ఒక దానం నాగేందర్ మినహా మిగితా వారికి సాంకేతికంగా అనర్హతను తప్పించుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దానం నాగేందర్ కు మాత్రం చిక్కులు తప్పవని తెలుస్తోంది.

ఇటీవల ప్రభుత్వం నియమించిన పీఏసీ ఛైర్మన్ ప్రకటన చూస్తే రాజకీయంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ ఒక స్పష్టతతో ఉన్నట్లు తెలుస్తోంది. అరికపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పడంతోనే పీఏసీ ఛైర్మన్ గా ప్రకటించామని స్పీకర్ కార్యాలయం ప్రకటించింది. అంటే మిగితా ఎమ్మెల్యేలు కూడా అదే చెప్పే అవకాశం లేకపోలేదు. దీంతో వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తించబడుతారు. అప్పుడు వారిపై అనర్హత కూడా ఉండకపోవచ్చు. కానీ దానం నాగేందర్ విషయంలో మాత్రం లెక్క వేరేలా ఉంది. దానం నాగేందర్ కాంగ్రెస్ గుర్తుపై లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో ఆయనపై ఖచ్చితంగా స్పీకర్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Read More : పేద కుటుంబానికి రూ. 12 వేలు.. రేవంత్ మరో సంచలనం

కాంగ్రెస్ పెద్దలు కూడా దానం విషయంలో మరో ఆలోచన చేస్తున్నట్టు టాక్‌. ఇప్పటికే దానం నాగేందర్ కు సంకేతాలు ఇచ్చిందట.ఉప ఎన్నికకు సిద్దంగా ఉండాల్సిందిగా దానం నాగేందర్ కు కాంగ్రెస్ అధిష్టానం చెప్పిందట. స్పీకర్ నిర్ణయానికి ముందే దానం నాగేందర్ తో రాజీనామా చేయించాలా లేక స్పీకర్ అనర్హుడిగా ప్రకటించే వరకు వేచి చూడాలా అన్న ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారట. ఏది ఏమైనా ఉప ఎన్నికను మాత్రం ఎదుర్కోక తప్పదు అన్న భావనలో కాంగ్రెస్ ఉందట. ఉప ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలనే కృతనిశ్చయంతో ఉందని గాంధీ భవన్‌ వర్గాలు అంటున్నాయి. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ వ్యూహాలు సిద్దం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉప ఎన్నిక వ్యూహాంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంపై ఇప్పటి నుంచే స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్లు తెలిసింది. వీలైనన్ని అభివృద్ది కార్యక్రమాలు ఇక నుంచి ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే చేపట్టాలని రేవంత్ డిసైడ్ అయ్యారట.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button