హైదరాబాద్ పరిధిలో చెరువులు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన కట్టిన అక్రమ నిర్మాణాలను కూకటివెళ్లతో తొలగిస్తున్న హైడ్రా మరింత దూకుడు పెంచనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ పవర్స్ ఇవ్వడంతో అక్రమ కట్టడాలను నేలమట్టం చేయడానికి సిద్ధమవుతోంది. భవనాల తొలగింపు కోసం కొత్త బుల్డోజర్లకు హైడ్రా ఆర్డర్ పెట్టిందని తెలుస్తోంది. ఏక కాలంతో నాలుగైదు ప్రాంతాల్లోనూ కూల్చివేతలు సాగేలా చర్యలు తీసుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం పెద్దపెద్ద యంత్రాలు ఎక్కువగా లేకపోవడంతో రోజు ఏదో ఒక చోట మాత్రమే హైడ్రా ఆపరేషన్ సాగుతోంది. కొత్త బుల్డోజర్లు వస్తే హైడ్రా కూల్చివేతలు మరింత తీవ్రం కానున్నాయి.
గత పది రోజులుగా కూల్చివేతలు ప్రారంభించిన హైడ్రా.. ఇప్పటివరకు 18 ప్రాంతాల్లో ఆపరేషన్ చేపట్టింది. దాదాపు 160 కట్టడాలను తొలగించింది. మరోవైపు తమ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాలంటూ హైడ్రాకు భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. అటు హైడ్రా కూడా ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసింది. ఎవరైనా ట్విట్టర్ ద్వారా హైడ్రాకు సమాచారం ఇవ్వొచ్చు. దీంతో అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు మరిన్ని ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్రమ నిర్మాణాలు ఎవరివైనా కూల్చేస్తామని ప్రకటించారు. తన మిత్రులు, సహచర మంత్రులు ఉన్నా కూల్చివేతలు ఆగవని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రకటనతో హైడ్రా కూల్చివేతలు మరింత ముమ్మరంగా సాగనున్నాయనే చర్చ సాగుతోంది.
ఇక బండ్లగూడ సలకం చెరువును కబ్జా చేసి ఒవైసీ బ్రదర్స్ అక్రమంగా కాలేజీలు కట్టారంటూ హైడ్రాకు భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. సలకం చెరువు గూగుల్ మ్యాపులతో సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతున్నారు. ఒవైసీ కాలేజీల విషయంలో హైడ్రా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుందని తెలుస్తోంది. పూర్తిగా చెరువులో కట్టిన భవనాలు కన్పిస్తున్నా కూల్చివేయకపోతే.. తమకు మైనస్ అవుతుందనే భావనలో హైడ్రా కమిషనర్ ఉన్నారంటున్నారు. అయితే ఒవైసీ బ్రదర్స్ కాలేజీ కావడంతో ప్రభుత్వం నుంచి అనుమతి కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. సీఎం నుంచి సానుకూల సంకేతాలు ఉన్నాయంటున్నారు. ఇప్పటికే లోకల్ అధికారులు ఫాతిమా కాలేజీకి నోటీసులు ఇచ్చారు. ఈ విషయాన్ని అక్బరుద్దీన్ ఒవైసీనే చెప్పారు. కాలేజీ జోలికి వస్తే ఊరుకునేది లేదన్నట్లుగా వార్నింగ్ ఇచ్చారు ఈ సమయంలో వెనక్కి తగ్గితే ఒవైసీ బ్రదర్స్ కు భయపడ్డారనే సంకేతం జనంలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇదీ హైడ్రాకు పెద్ద మైనస్. అందుకే సలకం చెరువులో నిర్మించిన ఒవైసీ కాలేజీని నేలమట్టం చేయాలనే హైడ్రా డిసైడ్ అయిందంటున్నారు. అదే జరిగితే సీఎం రేవంత్ రెడ్డి హీరోగా మారడం ఖాయమనే చర్చ సాగుతోంది.