
Transaction: భారతదేశంలో డిజిటల్ చెల్లింపు వ్యవస్థను మార్చి వేసిన మార్పులలో అత్యంత ముఖ్యమైనది UPI అనే చెల్లింపు విధానం. ఒక్క పైసా ఖర్చు లేకుండా కేవలం ఒక మొబైల్ ద్వారా దేశం మొత్తం డబ్బు పంపడం, స్వీకరించడం సాధ్యమైంది. అయితే ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ఫోన్ ఉండకపోవచ్చు. గ్రామీణ ప్రాంతాలలో ఇంకా అనేకమంది సాధారణ కీప్యాడ్ ఫోన్లతోనే కొనసాగుతున్నారు. ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేకపోవడం, నిత్యం నెట్ సిగ్నల్ సమస్యలు మరికొంతమందికి ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఇలా ఉన్నా కూడా డిజిటల్ చెల్లింపులు ఎలా కొనసాగించాలి అనే సందేహం చాలా మందిలో ఉంది.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన ప్రత్యేక సేవ ఈ సమస్యలన్నింటికి పరిష్కారంగా నిలిచింది. ఇంటర్నెట్ లేకుండా కూడా UPI లావాదేవీలు చేయడానికి ఒక సాధారణ USSD కోడ్ సరిపోతుంది. ప్రత్యేకంగా రూపొంచిన ఈ విధానం ద్వారా కీప్యాడ్ ఫోన్ నుంచి కూడా డబ్బు పంపడం, బ్యాలెన్స్ చెక్ చేయడం, లావాదేవీల వివరాలు తెలుసుకోవడం వంటివి సులభంగా చేయవచ్చు. ఈ సేవ దేశంలోని అన్ని బ్యాంకుల వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ వ్యవస్థను ఉపయోగించడానికి అవసరమైనది కేవలం ఒక రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మాత్రమే.
సేవను ఉపయోగించడానికి మొదట మొబైల్లో ఒక నిర్దిష్ట కోడ్ *99#ను డయల్ చేస్తే బ్యాంకింగ్ సేవల మెనూ తెరపై కనిపిస్తుంది. అక్కడి నుంచి మనకు కావాల్సిన ఆప్షన్ను ఎంచుకుని డబ్బు పంపడం మొదలైనవి చేయవచ్చు. లావాదేవీ పూర్తయ్యే వరకు ఏ ఇంటర్నెట్ అవసరం లేదు. బ్యాంక్ ఖాతా ఇప్పటికే UPIతో లింక్ అయ్యి ఉంటే ఈ ప్రక్రియ మరింత సులభంగా ఉంటుంది. ప్రతి దశను జాగ్రత్తగా చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు కూడా నెట్ లేని పరిస్థితిలో సురక్షితంగా డబ్బు పంపగలుగుతున్నారు.
ఇలా డబ్బు పంపే విధానం శ్రద్ధగా రూపొందించబడినందున భద్రతా పరంగా కూడా బలంగానే ఉండేలా చూసారు. ప్రతి లావాదేవీకి తప్పనిసరిగా UPI పిన్ అవసరం. ఇలా పిన్ ప్రవేశపెట్టిన తర్వాత మాత్రమే డబ్బు పంపడం జరుగుతుంది. పిన్ లేకుండా లావాదేవీ జరగదనే విధంగా భద్రతా శ్రద్ధ తీసుకున్నారు. నగదు తీసుకుని తిరగడం తగ్గిపోయి, ఇంటర్నెట్ లేకపోయినా కూడా డిజిటల్ చెల్లింపుల ప్రయోజనాలు అందరికీ చేరే మార్గం తెరుచుకుంది.





