అంతర్జాతీయం

15న పుతిన్‌- ట్రంప్ సమావేశం, జెలన్ స్కీ సంచలన వ్యాఖ్యలు!

Trump To Meet Putin:  రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో మరో కీలక సమావేశం జరగబోతోంది. ఈ అంశానికి సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 15న భేటీ కాబోతున్నారు. ఈ మేరకు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అలస్కాలో ఈ సమావేశం జరగబోతుందన్నారు. రష్యా, ఉక్రెయిన్‌ అధ్యక్షులు పుతిన్‌, జెలెన్‌స్కీ ఇద్దరూ శాంతిని కోరుకుంటున్నారని చెప్పారు. ఈ ఒప్పందంలో ఇరు దేశాల మధ్య భూభాగాల మార్పిడి ఉంటుందన్నారు. ఇరు దేశాలకూ ప్రయోజనం కలిగించేలా.. కొన్ని ప్రాంతాలను తీసుకోవడం,  మరికొన్నింటిని వదులుకోవడం జరగవచ్చన్నారు. ఇక అమెరికా, రష్యా అధ్యక్షులు  భేటీ కావడం 2021 తర్వాత ఇదే మొదటిసారి. అప్పటి అధ్యక్షుడు జో బిడెన్‌ జెనీవాలో పుతిన్‌ తో భేటీ అయ్యారు. పుతిన్‌ అమెరికా గడ్డమీద చివరిసారిగా 2015 సెప్టెంబర్‌ లో అడుగు పెట్టారు. ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనేందుకు న్యూయార్క్‌ వచ్చిన ఆయన.. అప్పటి అధ్యక్షుడు ఒబామాతో భేటీ అయ్యారు.

ఎట్టి పరిస్థితుల్లో తమ భూభాగం వదులుకోమన్న జెలెన్‌ స్కీ

శాంతి ఒప్పందంలో భాగంగా భూభాగాలను వదులుకోవాల్సి రావొచ్చన్న ట్రంప్‌ వ్యాఖ్యలపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌కు భాగస్వామ్యం లేకుండా ట్రంప్‌, పుతిన్‌ల మధ్య జరిగే చర్చలతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. వారు ఏదైనా డీల్‌ కుదుర్చుకుంటే అది విఫల పరిష్కారమే అవుతుందన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూభాగాన్ని వదులుకునే ప్రసక్తే లేదని జెలెన్‌ స్కీ తేల్చి చెప్పారు.

Read Also: 6 యుద్ధ విమానాలు కూల్చామన్న భారత్, పాక్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Back to top button