Indigo Crisis Reason: దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో గత కొద్ది రోజులుగా పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేసింది. దేశ వ్యాప్తంగా ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడేందుకు కారణం అయ్యింది. అయితే, ఇండిగోలో సంక్షోభం కావాలనే సృష్టించారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డీజీసీఏ నిబంధనల అమలుకు సమయం ఉన్నప్పటికీ ఎందుకు తగిన ఏర్పాట్లు చేసుకోలేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిబంధనల అమల్లోకి వచ్చిన వెంటనే ఉద్దేశపూర్వకంగానే విమాన సర్వీసుల రద్దు, జాప్యం వంటి చర్యలతో ప్రయాణికులకు ఇబ్బందులు సృష్టించడం ద్వారా నిబంధనల సడలిం పు కోసం యాజమాన్యం ప్రయత్నించిందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి.
కావాలనే సంక్షోభం?
డీజీసీఏ నిబంధనలు అమల్లోకి వచ్చిన సమయంలోనే భారీగా విమాన సర్వీసులు రద్దవడం అనుకోకుండా జరగలేదని, సంక్షోభాన్ని సృష్టించి, డీజీసీఏ నిబంధనల సడలింపు కోసమే నిర్వహణా వైఫల్యం జరిగినట్లుగా చెప్తున్నారనే అనుమాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారంలో ఫ్రంట్‌లైన్ సిబ్బందిని వాడుకొని, వారి సమస్యలను పరిష్కరించుకున్నట్లుగా కనిపిస్తోందని తెలుస్తోంది. డీజీసీఏ మీద ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగంగానే ఇదంతా చేస్తున్నట్లుగా ఉందని కేంద్రం అనుమానిస్తోంది.
ఇండిగోకు డీజీసీఏ తాత్కాలిక ఉపశమనం
ఇండిగో సంక్షోభంతో డీజీసీఏపైలట్ల విధులకు సంబంధించి ఆ సంస్థకు ఊరట కల్పించేలా పైలట్ల వీక్లీ రెస్ట్ నిబంధనలో మార్పులు చేస్తూ శుక్రవారం ఓ ప్రకటన చేసింది. వందలాది సర్వీసుల రద్దుతో సతమతమవుతున్న ఇండిగో.. నిబంధనలు సడలించాలంటూ డీజీసీఏను ఆశ్రయించింది. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ నుంచి ఉపశమనం కల్పించాలని కోరింది. దీంతో పైలట్ల విధులకు సంబంధించి తాజా మార్పు లు చేపట్టింది. ఇవి తాత్కాలికం మాత్రమేనని పేర్కొంది. గతంలో పైలట్లకు వారంలో విశ్రాంతి సమయాన్ని 36గంటల నుంచి 48గంటలకు పెంచగా ఇప్పుడు ఈ వీక్లీ రెస్ట్‌ను సెలవుగా పరిగణించనున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. ప్రస్తుత గందరగోళాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మినహాయింపులు వచ్చే ఫిబ్రవరి 10వరకు అమల్లో ఉంటాయని, ప్రతి 15 రోజులకోసారి వీటిపై సమీక్ష నిర్వహిస్తామని పేర్కొంది.
ఇండిగోపై చర్యలు తీసుకుంటామన్ రామ్మోహన్
ఇండిగో సంక్షోభం అతి త్వరలోనే సమసిపోతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు చెప్పారు. ప్రభుత్వ చర్యల కారణంగా వచ్చే మూడు రోజుల్లో ఇండిగో విమాన సర్వీసులన్నింటినీ పునరుద్ధరించే అవకాశం ఉందన్నారు. విమానాల రద్దుతో సంక్షోభానికి కారణమైన ఇండిగోపై చర్యలు తీసుకుంటామన్నారు.





