
Uttar Pradesh Accident: ఉత్తర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో దైవ దర్శనం కోసం వెళ్తుండగా అదుపు తప్పి కాలువలో పడింది. ఈ ఘటనలో ఒకే ఫ్యామిలీకి చెందిన 9 మంది సహా మొత్తం 11 మంది స్పాట్ లోనే చనిపోయారు. ప్రయాణ సమయంలో కారులో మొత్తం 15 మంది ఉన్నట్లు తెలుస్తోంది.
పృథ్వీనాథ్ ఆలయ దర్శనం కోసం వెళ్తుండగా..
ఉత్తత ప్రదేశ్ లోని గోండా జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. పృథ్వీనాథ్ ఆలయ దర్శనం కోసం భక్తులతో బయలుదేరిన ఓ బొలేరో వాహనం అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మందితో సహా పదకొండు మంది మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. పృథ్వీనాథ్ ఆలయానికి 15 మంది బొలేరో వాహనంలో బయలుదేరారు. మార్గం మధ్యలో కారు అదుపుతప్పి సరయు కాలువలో పడిపోయింది.
విషయం తెలుసుకుని వెంటనే స్పాట్ కు చేరకున్న పోలీసులు, స్థానికులు, రెస్క్యూ బృందాలతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే చాలా మంది చనిపోయారు. వారి మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఇద్దరు పురుషులు, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అతివేగం కారణంగానే వాహనం అదుపుతప్పి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
సీఎం యోగి సంతాపం, రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా
అటు ఈ ఘటనపై సీఎం యోగి ఆధిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.