
Pakistani Nationals On Bihar Voter List: బీహార్ ఓటర్ల జాబితాపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరో కీలక విషయం వెలుగు చూసింది. తాజాగా ఓట్ల లిస్టులో ఏకంగా పాకిస్తాన్ వ్యక్తుల పేర్లు కనిపించాయి. ఒక్కసారిగా అదికారులు షాక్ అయ్యారు. అంతేకాదు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో వారి ఓటర్ కార్డులను ధృవీకరించచారు. ఆ వ్యక్తులు పాక్ జాతీయులని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే గుర్తించింది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లు తొలగించడంతోపాటు దర్యాప్తునకు ఆదేశించింది ఎన్నికల సంఘం.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
బీహార్ భాగల్పూర్ జిల్లా భికాన్ పూర్ లోని ట్యాంక్ లేన్ లో వృద్ధులైన ఇద్దరు ముస్లిం మహిళలు నివసిస్తున్నారు. వీరిలో ఫిర్దౌసియా ఖానం 1956 జనవరి 19న మూడు నెలల వీసాపై భారత్‌కు వచ్చింది. ఇమ్రానా ఖానం అలియాస్ ఇమ్రానా ఖాతూన్ కూడా మూడు సంవత్సరాల వీసాపై భారత్‌కు వచ్చింది. వారి వీసా గడువు ముగిసినప్పటికీ పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లలేదు. భికాన్ పూర్ లోని ట్యాంక్ లేన్ లో నివసించే ముస్లిం వ్యక్తులను పెళ్లి చేసుకుని స్థిరపడ్డారు. ఇబ్తుల్ హసన్ భార్య అయిన ఇమ్రానా ఖానం, మహ్మద్ తఫ్జీల్ అహ్మద్ భార్య అయిన ఫిర్దౌసియా ఖానం చాలా ఏళ్లుగా బీహార్‌లో జరిగే అన్ని ఎన్నికల్లో ఓటు వేస్తున్నారు. ఓటరు జాబితాలో ఉన్న ఈ వృద్ధ మహిళల పేర్లను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో కూడా ధృవీకరించారు. అయితే వారిద్దరూ పాకిస్థాన్ జాతీయులని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా గుర్తించింది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లు తొలగించడంతోపాటు దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని ఆదేశించింది.