
సామాన్యుడి పోషకాహారంగా గుర్తింపు పొందిన కోడిగుడ్డు ఇప్పుడు పేద, మధ్య తరగతి కుటుంబాలకు భారంగా మారుతోంది. ఒకప్పుడు తక్కువ ధరలో అందుబాటులో ఉండే గుడ్డు, ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్న ధరలతో వినియోగదారుల జేబులను ఖాళీ చేస్తోంది. గత కొన్ని నెలలుగా క్రమంగా పెరుగుతూ వచ్చిన గుడ్డు ధరలు ఇప్పుడు పౌల్ట్రీ రంగ చరిత్రలోనే ఎన్నడూ లేని స్థాయికి చేరాయి. ఈ పరిస్థితి అటు వినియోగదారులను, ఇటు వ్యాపారులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
కొద్ది నెలల క్రితం వరకు బహిరంగ మార్కెట్‌లో ఒక్కో కోడిగుడ్డు ధర రూ.5 నుంచి రూ.6 మధ్యలో ఉండేది. కానీ ఇప్పుడు అదే గుడ్డు ధర రికార్డు స్థాయిలో రూ.8కి చేరింది. హోల్‌సేల్ మార్కెట్‌లోనూ ధరలు తగ్గలేదు. అక్కడ ఒక్కో గుడ్డు రూ.7.30 వరకు పలుకుతుండటం గమనార్హం. గతంలో రూ.160 నుంచి రూ.170 వరకు లభించిన గుడ్ల ట్రే ప్రస్తుతం రూ.210 నుంచి రూ.220 వరకు పెరిగింది. నాటు కోడి గుడ్ల పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. ఒక్కో నాటు గుడ్డు ధర రూ.15 వరకు చేరింది.
చలికాలంలో గుడ్లకు డిమాండ్ పెరగడం సాధారణమే అయినప్పటికీ.. ఈ స్థాయిలో ధరలు పెరగడం పౌల్ట్రీ పరిశ్రమలో ఇదే తొలిసారి అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి లేకపోవడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా వ్యాపారులు పేర్కొంటున్నారు.
గతంలో తెలుగు రాష్ట్రాల్లో రోజుకు సుమారు 8 కోట్ల గుడ్ల ఉత్పత్తి ఉండేది. అయితే ప్రస్తుతం ఆ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. కోళ్ల ఫారాల నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరగడంతో చిన్న, మధ్య తరహా రైతులు ఈ రంగానికి దూరమవుతున్నారు. కోళ్లకు పెట్టే దాణా, మక్కలు, సోయా, చేపపొట్టు వంటి ముడిసరుకుల ధరలు అమాంతం పెరగడంతో ఫారాలను నడపడం భారంగా మారిందని రైతులు వాపోతున్నారు.
ఇక గతంలో కోల్డ్ స్టోరేజీలలో సుమారు 20 కోట్ల గుడ్ల వరకు నిల్వలు ఉండేవని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ నిల్వలు పూర్తిగా తగ్గిపోవడంతో మార్కెట్‌లో సరఫరా కొరత ఏర్పడింది. ఈ కొరతే ధరలను మరింత పెంచుతోంది.
మధ్యతరగతి, పేద కుటుంబాల్లో ప్రోటీన్ ఆహారానికి కోడిగుడ్డే ప్రధాన ఆధారం. కూరగాయల ధరలు పెరిగినప్పుడు చాలామంది గుడ్డుపైనే ఆధారపడతారు. కానీ ఇప్పుడు గుడ్డు ధర కూడా పెరగడంతో సామాన్యుడి ఇంటి బడ్జెట్ పూర్తిగా గందరగోళంగా మారింది. ఇంటి వంటలకే కాకుండా హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలపై కూడా ఈ ప్రభావం పడుతోంది. ఎగ్ రైస్, ఆమ్లెట్, ఎగ్ బిర్యానీ వంటి ఆహార పదార్థాల ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రభుత్వం నిర్వహించే మధ్యాహ్న భోజన పథకం, అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా ఈ పెరిగిన గుడ్డు ధరలు భారంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సరఫరా పరిమితంగా మారిందన్న సమాచారం వినిపిస్తోంది.
మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం.. వచ్చే రెండు నెలల వరకు గుడ్డు ధరలు తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. సంక్రాంతి పండుగ, శీతాకాలం ముగిసే వరకు డిమాండ్ అధికంగానే కొనసాగనుండటంతో ధరలు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిలోనే ఉండొచ్చని భావిస్తున్నారు. కోళ్ల దాణాపై సబ్సిడీ ఇవ్వడం లేదా ఉత్పత్తి పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్ప ధరలు నియంత్రణలోకి వచ్చే పరిస్థితి లేదని పౌల్ట్రీ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ALSO READ: Controversy: ప్రముఖ లేడీ సింగర్‌కి వేధింపులు





