ఆంధ్ర ప్రదేశ్

తిరుమల కొండపై తుపాకులతో సైనికుల పరుగులు

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదులు చొరబడితే ఎలా ఎదుర్కోవాలనే దానిపై అక్కడి భద్రతా దళాలకు శిక్షణ ఇస్తున్నారు. కొండపైకి ప్రవేశించే ప్రతీ ఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలిపిరి చెక్ పోస్ట్ వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. భక్తుల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

నిన్న తిరుమలలో భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించారు. తిరుమలలో ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి.. భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను లేపాక్షి స‌ర్కిల్ వ‌ద్ద ఉన్న సుద‌ర్శన్‌ స‌త్రంలో భద్రతా దళాల మాక్ డ్రిల్ ద్వారా చేసి చూపారు. ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా మ‌రియు భ‌ద్రతా, సివిల్ పోలీసులకు, రిజర్వు పోలీసులకు, ఆలయ సిబ్బందికి, వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరించారు.

అసాల్ట్ డాగ్ ఎనిమీ ఎటాక్‌, రూమ్ ఇన్టర్వెన్షన్ కార్యక‌లాపాలు చేసి చూపారు. దాదాపు ఒక‌టిన్నర గంట‌పాటు ఈ మాక్ డ్రిల్ కొన‌సాగింది. ఈ మాక్ డ్రిల్ 28 మంది ఆక్టోప‌స్ కమాండోలు, 25 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, 15 మంది పోలీసులు, 10 ఏపీఎస్పీ సిబ్బంది ఈ మాక్ డ్రిల్ లో భాగ‌మ‌య్యారు. ఈ కార్యక్రమంలో వీజీవోలు రామ్ కుమార్, సురేంద్ర, డీఎస్పీ శ్రీ విజ‌య శేఖ‌ర్‌, ఏవిఎస్వోలు, పోలీసు, ఆక్టోపస్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

పహల్గాం ఉగ్ర దాడితో పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అలర్ట్ అయ్యింది. తిరుపతి, తిరుమలలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. తిరుపతిలో ఉన్న ప్రధాన ప్రాంతాలైన ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషన్‌, విష్ణునివాసం, మాధవం, అన్ని ఆలయాల దగ్గర ముందస్తు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుపతిలో అనుమానం ఉన్న వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. తిరుపతిలోని అన్ని రోడ్లు, ముఖ్య కూడళ్లలో బాంబు, డాగ్‌ స్క్వాడ్లు తనిఖీలు చేస్తున్నాయి. బాంబు స్క్వాడ్‌లు రంగంలోకి దిగి లాడ్జీలు, కొన్ని భవనాల్లో తనిఖీ చేశారు. అలాగే ఆలయాల దగ్గర భద్రత పెంచారు.. వాహనాల తనిఖీలు చేస్తున్నారు.

రెండు రోజుల పాటు ఈ తనిఖీలు కొనసాగనున్నాయి. తిరుపతి, తిరుమలలో మొత్తం 75 ప్రాంతాల్లో భద్రతా బలగాలు తనిఖీలు చేస్తున్నారు. అలిపిరి సమీపంలో చెక్‌ పాయింట్‌ దగ్గర భద్రతను పెంచారు.. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. తిరుమల రెండు ఘాట్‌ రోడ్లలో కూంబింగ్‌ చేపట్టారు.. ఘాట్‌లోని లింకు రోడ్డులో ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. మొత్తం మీద తిరుపతితో పాటుగా తిరుమలలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button