టీడీపీకి కనిపించని శత్రువు పవనే..! – ఈ సత్యం చంద్రబాబు గ్రహించేదెప్పుడో..?

పవన్‌ కళ్యాణ్‌.. జనసేన అధ్యక్షుడు. 2024 ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్‌ రేట్‌తో విజయం సాధించిన పార్టీకి నాయకుడు. 2024 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఎదుర్కొనేందుకు… ఏపీలో NDA కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించాడు. కేంద్రంలోని బీజేపీ నాయకత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయి పవన్‌కు. అయితే… రాజకీయాల్లో ఏ స్నేహమైనా… పొలిటికల్‌ లాభనష్టాల మేరకే ఉంటుంది. నిజం చెప్పాలంటే… పవన్‌ సాయంతో దక్షిణాదిలో పాగా వేయాలన్నదే బీజేపీ ప్లాన్‌ అన్న చర్చ ఉంది. అందుకే పవన్‌ కళ్యాణ్‌కు అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు బీజేపీ పెద్దలు. NDA కూటమి పేరుతో ఇప్పటికే ఏపీలో అధికారం పంచుకుంటోంది బీజేపీ. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబే కావొచ్చు.. కానీ… డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్‌ కళ్యాణ్‌ కూడా.. తానేమీ తక్కువ కాదన్న రీతిలో ఆలోచిస్తున్నారు. కొన్ని సార్లు… ఎవరినీ సంప్రదించకుండా సొంత నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అయినా… సీఎం చంద్రబాబు గానీ, టీడీపీ నేతలు గానీ ఖండించలేని పరిస్థితి ఉంది.

జనసేన ఆవిర్భావ సభలో పవన్‌ కళ్యాణ్‌ స్పీచ్‌ చూస్తే… ఏపీలో NDA కూటమి విజయానికి తానే కారణమన్న రీతిలో ఉంది. 40ఏళ్ల పార్టీ టీడీపీని కూడా ఆయనే బతికించారట. NDA కూటమిని నిలబెట్టారట. ఆ మాటల్లో విజయగర్వం కనిపిస్తోంది. జనసేనకు అంత సత్తా ఉండి ఉంటే.. ఎన్నికల్లో ఒంటరిగా ఎందుకు పోటీచేయలేదు. జనసేనకు అంత ఓటు బ్యాంక్‌ ఉందా…? జనసేన విజయంలో టీడీపీ పాత్ర లేదా..? టీడీపీ ఓటర్లు జనసేనకు ఓటు వేయలేదా…? దీన్ని పవన్‌ కళ్యాణ్‌ ఎలా మర్చిపోయారు. మొన్నటికి మొన్న… కూటమితో కలిసే ఉంటామని.. అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు పవన్‌ కళ్యాణ్‌. విభేదాలు ఉన్నా… ఐక్యతగా ముందుకు వెళ్తామన్నారు. దీంతో టీడీపీ నేతలు ఊపిరిపీల్చుకుని ఉండొచ్చు. కానీ… పవన్‌ కళ్యాణ్‌ అన్న మాటపై నిలబడతారా..? అన్నది ఆలోచించాలి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా కాలేదు. ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది. ఈ లోపు ఎప్పుడైనా… ప్రభుత్వ తీరుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తే… అప్పుడు కూడా కూటమితో పవన్‌ కలిసి ఉంటారా..? తప్పులో భాగం పంచుకుంటారా…? టీడీపీ తీరును ఎండగట్టి… కూటమి నుంచి బయటకు రారన్న గ్యారెంటీ ఉందా…?

పవన్‌ కళ్యాణ్‌ ఒక్కడే అయితే… అదో తీరు. కానీ… ఆయన వెనుక బీజేపీ ఉంది. ఏపీ, తెలంగాణలో అధికారం చేపట్టాలని కమలం పార్టీ ఎన్నో ఏళ్లుగా ఊవిళ్లూరుతోంది. ఆ పార్టీకి.. పవన్‌ కళ్యాణ్‌ రూపంలో ఒక మంచి అవకాశం వచ్చింది. అందుకే… పవన్‌ కళ్యాణ్‌ను పక్కన కూర్చోబెట్టుకుంటోంది. ఇది.. చంద్రబాబు బాగా ఆలోచించాల్సిన విషయం. చంద్రబాబుకు… రాజకీయాల్లో అపర చాణిక్యుడు అనే పేరు ఉంది. అయినా.. ఆయన పవన్‌ కళ్యాణ్‌ రూపంలో టీడీపీకి వచ్చే ముప్పును గుర్తించలేకపోతున్నారా..? పామును పక్కనే కూర్చోబెట్టుకుని పాలు పోస్తున్నారా…? పాముకు పాలుపోసినా.. కరవక మానదనే సామెతను చంద్రబాబు మర్చిపోయారా..? ఇప్పటికైనా మేలుకుంటే.. అది ఆయనకు, ఆయన పార్టీకి మంచిదనేది విశ్లేషకుల మాట.

చంద్రబాబు ఇప్పటికీ.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీనే టార్గెట్‌ చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌… చంద్రబాబుకు ప్రత్యర్థే కాదనడంలేదు. కానీ కనిపించే శత్రువు కన్నా… కనిపించని శత్రువు ఎంతో ప్రమాదకరం. చంద్రబాబు ఫామ్‌లో ఉన్నంత వరకు టీడీపీకి డోకా ఉండదు. ఆ తర్వాత పరిస్థితి ఏంటి…? బీజేపీ-జనసేన ఒక్కటై టీడీపీని దూరం పెడితే.. ఏమవుతుంది..? అన్నది చంద్రబాబు ఇప్పటి నుంచే ఆలోచించాల్సి ఉంది. తెలుగు దేశం పార్టీ పరులపాలు కాకుండా కాపాడుకోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇవి కూడా చదవండి …

  1. CM Revanth Reddy : పదేళ్లు నేనే సీఎం.. భట్టి, ఉత్తమ్‍కు రేవంత్ షాక్!

  2. ఇద్దరు హీరోల మధ్య గొడవ!…. రాజకీయంలో ఏదైనా జరగొచ్చు అంటే ఇదేనేమో?

  3. హర్ష సాయి పై కేసు నమోదు!… వరుసుగా అరెస్టు అవుతున్న బెట్టింగ్ ప్రమోటర్స్?

  4. జనసేన జాతీయ పార్టీ కాబోతోందా – ఆవిర్భావ సభలో పవన్‌ వ్యాఖ్యల అర్థం అదేనా!

  5. మా సిఫారసు పనికిరాదా.. టీటీడీతో తాడోపేడో తేల్చుకుంటామన్న తెలంగాణ నేతలు

Exit mobile version