అంతర్జాతీయం

Liechtenstein: 40 వేలమంది మాత్రమే ఉండే ఆ దేశంలో ప్రతీ ఒక్కరూ కోటీశ్వరులే..!

Liechtenstein: లిక్టెన్‌స్టెయిన్ అనే చిన్న దేశం ప్రపంచ మ్యాప్‌లో పెద్దగా కనిపించకపోయినా, ఆర్థిక రీతిలో మాత్రం అపారమైన శక్తి కలిగి ఉంది.

Liechtenstein: లిక్టెన్‌స్టెయిన్ అనే చిన్న దేశం ప్రపంచ మ్యాప్‌లో పెద్దగా కనిపించకపోయినా, ఆర్థిక రీతిలో మాత్రం అపారమైన శక్తి కలిగి ఉంది. మొత్తం విస్తీర్ణం కేవలం 160 చదరపు కిలోమీటర్లు, జనాభా కేవలం 40 వేల మంది మాత్రమే ఉన్న ఈ దేశం 2025 నాటికి ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాల్లో మొదటి స్థానంలో నిలిచింది. తలసరి జీడీపీ 2.13 లక్షల డాలర్లు, అంటే భారతీయ కరెన్సీలో దాదాపు 1.8 కోట్ల రూపాయలు కావడం ఆశ్చర్యకరం. ఇక్కడ ప్రతి పౌరుడూ కోటీశ్వరుడే అని చెప్పడంలోపూ అతిశయోక్తి లేదు. ఉద్యోగ అవకాశాలు జనాభా కంటే ఎక్కువగా ఉండడం వల్ల నిరుద్యోగం తక్కువ స్థాయిలో ఉండగా, ప్రభుత్వానికి రుణభారం ఒక్క రూపాయి కూడా లేదు. ఇలాంటి అరుదైన ఆర్థిక విజయ కధ వెనుక ఎన్నో సంవత్సరాల ప్రణాళిక, పట్టుదల, వ్యూహాలు దాగి ఉన్నాయి.

మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత తీవ్రమైన పేదరికం ఈ దేశాన్ని చుట్టుముట్టింది. ఆల్ప్స్ పర్వతాల మధ్య ఉండటంతో సహజ వనరులేమీ లేవు. మంచు పొరలు, రాతిబండలతో నిండిన భూమిలో వ్యవసాయం దాదాపు అసాధ్యం. అయితే, 1921లో కొత్త రాజ్యాంగం రూపుదిద్దుకున్న తర్వాత దేశ అభివృద్ధికి కొత్త దిశ తీసుకురావబడింది. ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ వంటి అభివృద్ధి చెందిన దేశాలతో స్నేహపూర్వక వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకున్నారు. చుట్టుపక్కల శాంతియుత వాతావరణం, స్థిరమైన ఆర్థిక విధానాలు కలిసి లిక్టెన్‌స్టెయిన్‌ను మెల్లగా ప్రపంచ ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాయి. నేడు ఈ ధనిక దేశానికి ఆర్మీ లేదు, పోలీసుల సంఖ్య 300 మాత్రమే, అయినా నేరాల రేటు శూన్యం. ప్రజలు ఇళ్లకు తాళం వేసే అవసరం కూడా లేకుండా జీవిస్తున్నారు. 1997 తర్వాత ఇక్కడ ఒక్క అరెస్ట్ కూడా జరగకపోవడం ఇక్కడి శాంతి వాతావరణానికి నిదర్శనం.

ఈ అద్భుత ఆర్థిక విజయంలో ప్రధాన పాత్ర పరిశోధనలదే. ఇక్కడ ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి పెట్టి, తయారీ రంగాన్ని బలోపేతం చేసింది. ప్రత్యేకంగా షాన్ నగరంలో తయారయ్యే దంత ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ను సొంతం చేసుకున్నాయి. 120 దేశాలకు ఎగుమతి అవుతున్న ఈ దంత కిరీటాలు, ఫిల్లింగ్స్ హాలీవుడ్ స్టార్‌లకూ ప్రత్యేకంగా తయారు చేయబడుతుండటంతో లిక్టెన్‌స్టెయిన్‌ను ‘డెంటల్ క్యాపిటల్’ అని పిలుస్తారు. ఎలక్ట్రానిక్స్, ఆప్టిక్స్, హిల్టీ టూల్స్ వంటి రంగాలలో కూడాపైచేయి సంపాదించుకుంది. ఫైనాన్షియల్ సర్వీసులు మరింత బలంగా ఉండడంతో 400కు పైగా ఎసెట్ మేనేజ్‌మెంట్ సంస్థలు, 11 బ్యాంకులు, 30 ఇన్సూరెన్స్ కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఆసక్తికర విషయం ఏమంటే.. స్విస్ ఫ్రాంక్‌ను కరెన్సీగా ఉపయోగించే ఈ దేశానికి సొంత ఎయిర్‌పోర్ట్ కూడా లేదు. పక్క దేశాల్లో దిగిపోతే సరిపోయేలా సౌకర్యాలు ఉన్నాయి.

ఇక్కడి టూరిజం రంగం కూడా దేశ ఆర్థిక స్థిరత్వానికి ముఖ్యమైన స్తంభం. వాడుజ్ రాజకోటలు, మంచు అడవులు, స్కీయింగ్ రిసార్టులు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తాయి. 2023లోనే 1.16 లక్షల మంది పర్యాటకులు ఈ చిన్న దేశాన్ని సందర్శించారు. పోస్టల్ స్టాంపులు లిక్టెన్‌స్టెయిన్ ప్రత్యేక గుర్తింపు. 24 క్యారట్ బంగారంతో తయారయ్యే స్టాంపులు, 3డీ డిజైన్లు ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో ఆకర్షిస్తాయి. సామాజిక స్వేచ్ఛను పెంపొందిస్తూ 2025లో సమ్-సెక్స్ మ్యారేజ్ చట్టాన్ని అమలు చేసుకోవడం, IMF సభ్యత్వం పొందడం ఈ దేశ అభివృద్ధి దిశలో తీసుకున్న ముందడుగులు. ఎన్నో ప్రతికూల పరిస్థితులు, సహజమైన అడ్డంకులు ఉన్నా వాటిని అవకాశాలుగా మలుచుకోవడం లిక్టెన్‌స్టెయిన్‌ను ప్రపంచానికి ఆదర్శంగా నిలిపింది.

ALSO READ: Accident: డ్రైవర్‌కు గుండెపోటు.. ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button