జాతీయం

Renuka Chowdhury: కొనసాగుతున్న ‘కుక్క’ వివాదం.. పార్లమెంట్ లో రేణుక వ్యవహారంపై దుమారం!

రేణుకా చౌదరి కుక్క వ్యవహారంపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఆమెపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉందన్న వార్తలపై రేణుక స్పందించిన తీరు మరింత దుమారం రేపుతోంది.

Renuka Chowdhury Dog Row: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తన కారులో కుక్కను తీసుకుని పార్లమెంటుకు రావడంపై చెలరేగిన దుమారం మరింత ముదిరింది. ఎంపీలకు కల్పించిన హక్కులకు ఇది విరుద్ధమని బీజేపీ దీనిపై మండిపడగా, ఆమెపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు ప్రచారం కొనసాగుతోంది. ఇదే అంశంపై ఆమెను మీడియా ప్రశ్నించగా..  ‘బౌ బౌ’ అంటూ రియాక్షన్ ఇచ్చింది. “ఇంతకంటే ఏం చేయాలి? తీర్మానం పెట్టినప్పుడు చూద్దాం” అని చెప్పింది.

ఇంతకీ అసలు వివాదం ఏంటంటే?

పార్లమెంటు సమావేశాల తొలి రోజు రేణుకా చౌదరి కారులో తన శునకాన్ని తీసుకుని పార్లమెంటు ఆవరణలోకి వచ్చారు. వెంటనే భద్రతాసిబ్బంది ఆ కుక్కను వెనక్కి పంపేశారు. తాను రోడ్డుపై వస్తున్నప్పుడు రెండు వాహనాలు ఢీకొని మధ్యలో కుక్కపిల్ల కనిపించిందని, అది గాయపడి ఉంటుందని భావించి కారులో తీసుకువచ్చానని, ఇక్కడకు వచ్చిన వెంటనే ఆ కుక్కను తన ఇంటికి పంపించేశానని చెప్పారు. ఇందులో సమస్య ఏముందని ప్రశ్నించారు.

రేణుకా తీరుపై బీజేపీ విమర్శలు

అటు రేణుకా చౌదరి చర్యను బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ తప్పుపట్టడంతో ఆమె తిరిగి స్పందించారు. “కాలుష్యంతో జనం చనిపోతున్నారు. దానిపై ఎవరికీ ఎలాంటి బాధ లేదు.  కార్మిక చట్టాలు రుద్దుతున్నారు. సంచార్ సాథీ యాప్ బలవంతంగా మనపై రుద్దుతున్నారు. కానీ రేణుకా చౌదరి కుక్క అందరికీ ఆందోళనకరమైన విషయంగా కనిపిస్తోంది. ఇంతకంటే ఏమి చెప్పాలి? మూగజీవాలను నేను ప్రేమిస్తాను” అన్నారు.  పార్లమెంటు ఆవరణలోకి కుక్కలు రాకూడదనే నిషేధం ఏదీ లేదని, అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా ఒకసారి ఎద్దులబండిపై వచ్చారని గుర్తుచేశారు. కుక్కలు ఎంతో విధేయతతో ఉంటాయని, విధేయత గురించి ఈ వ్యక్తులకేం తెలుసునని ప్రశ్నించారు. ఇప్పుడు కిరణ్ రిజిజు మాకు క్యారెక్టర్ సర్టిఫికెట్ ఇస్తారా? అని అడిగారు. తనపై ఎవరు హక్కుల తీర్మానం పెడతారో చూడాలన్నారు. ఒకవేళ తీర్మానం పెడితే అప్పుడు తాను స్పందిస్తానన్నారు.

Back to top button