
హైదరాబాద్ నగరంలో మరో దారుణ హత్య కలకలం రేపింది. కట్టుకున్న భర్తనే తన సుఖానికి అడ్డుగా భావించిన ఓ భార్య.. ప్రియుడితో కలిసి పక్కా పథకం వేసి భర్తను హతమార్చిన ఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ ప్రాంతంలో వెలుగుచూసింది. వివాహేతర సంబంధం కారణంగా జరిగిన ఈ హత్య స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
ఒడిశా రాష్ట్రానికి చెందిన నారాయణ్ బెహరా, బంధిత బెహరా దంపతులు ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. మల్లాపూర్ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. నారాయణ్ ప్లంబర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అదే ఇంట్లో విద్యాసాగర్ అనే యువకుడు కూడా అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలో బంధితకు, విద్యాసాగర్‌కు పరిచయం ఏర్పడింది.
పరిచయం కాస్తా స్నేహంగా, ఆపై వివాహేతర సంబంధంగా మారింది. గత 4 నెలలుగా వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయం నారాయణ్‌కు తెలిసిపోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భర్త ప్రశ్నించడాన్ని, తనపై ఆంక్షలు విధించడాన్ని బంధిత తీవ్రంగా ద్వేషించడం ప్రారంభించింది. తమ సంబంధానికి భర్త అడ్డుగా మారాడని భావించిన బంధిత.. ప్రియుడు విద్యాసాగర్‌తో కలిసి అతడిని శాశ్వతంగా తొలగించాలనే దుర్మార్గపు నిర్ణయానికి వచ్చింది.
పథకం ప్రకారం అనుకూల సమయం చూసుకున్న నిందితులు.. నారాయణ్‌పై ఇనుప రాడ్డుతో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన నారాయణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మొదట ఈ మరణాన్ని సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినా, ఘటనలో అనుమానాస్పద పరిస్థితులు ఉండటంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు.
నారాయణ్ మృతిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు, భార్య బంధితను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో ప్రియుడు విద్యాసాగర్‌తో కలిసి హత్య చేసినట్లు అంగీకరించింది. ఆమె వాంగ్మూలంతో కేసు మలుపు తిరిగింది. పోలీసులు వేగంగా స్పందించి, హత్య జరిగిన 24 గంటల లోపే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
అరెస్ట్ చేసిన అనంతరం బంధిత బెహరా, విద్యాసాగర్‌లను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. కట్టుకున్న భర్తను కాపాడాల్సిన భార్యే అతని ప్రాణాలు తీసిందన్న విషయం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. వివాహేతర సంబంధాలు ఎలా ప్రాణాంతక పరిణామాలకు దారితీస్తున్నాయో ఈ కేసు మరోసారి స్పష్టంగా చూపుతోందని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు.
ALSO READ: పాముతో పోలీసులకు బెదిరింపులు (VIDEO)





