జాతీయం

Omar Abdullah: రాహుల్ కు ఒమర్ అబ్దుల్లా షాక్.. ఆ ప్రచారంతో తమకు సంబంధం లేదని వ్యాఖ్య!

కాంగ్రెస్ చేపట్టిన ఓట్ చోరీ ప్రచారానికి ఇండియా కూటమికి సంబంధం లేదన్నారు ఒమర్ అబ్దుల్లా. ప్రతి పార్టీకి ఒక ఎజెండా ఉంటుందని, కాంగ్రెస ఓట్ చోరీ ఎజెండాను ఎంచుకుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ అంశాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా ఢిల్లీలో మెగా ర్యాలీ నిర్వహించింది. ఓటింగ్ ప్రక్రియను తారుమారు చేసేందుకు బీజేపీతో ఎన్నికల కమిషన్ కుమ్మక్కయిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ, ఈసీ ఖండించాయి.

ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు

అటు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఓచ్ చోరీ ప్రచారంపై  నేషనల్ కాన్ఫరెన్స్  నేత, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా   ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల చోరీ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతోందని, దీనికి ఇండియా కూటమితో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ప్రతి పార్టీ తమ ఎజెండాను ఎంచుకుంటుందని, కాంగ్రెస్ పార్టీ తమ ప్రధాన అంశాలుగా ఎస్ఐఆర్, ఓట్ చోరీని ఎంచుకుందని, వాళ్లకు ఏంచేయాలో చెప్పేందుకు తామెవరిమని ప్రశ్నించారు.

వెంటిలేటర్ పై ఇండియా కూటమి

ఒమర్ అబ్దుల్లా రీసెంట్ గా ‘ఇండియా’ కూటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  తమ కూటమి ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉందన్నారు. బహార్ సీఎం నితీశ్‌ కుమార్‌‌ను మళ్లీ ఎన్డీయేకు తాము నెట్టేసినట్టు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి కోలుకుంటోందని అనుకుంటున్న దశలో బీహార్ ఫలితాలతో పరిస్థితి మళ్లీ దిగజారిందన్నారు. బీహార్‌లో జేఎంఎం పార్టీని మహాగఠ్‌బంధన్‌లో చేర్చుకోకపోవడాన్ని నిలదీశారు. జేఎంఎం కూటమి జాతీయ స్థాయిలో ఇండియా కూటమిని వీడినట్లయితే తప్పెవరిదవుతుందని ఒమర్ ప్రశ్నించారు. ఇండియా  కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ ఒకటిగా పనిచేయాలని, లేనట్లయితే రాష్ట్రాలకే పరిమితమైన కూటములుగా మిగిలిపోతాయని అన్నారు. ఇండియా కూటమిగా మనం చెప్పుకోవాలనుకుంటే మరింత సమగ్రతను సాధించాల్సి ఉంటుందన్నారు.

Back to top button