
Viral video: సరీసృపాల ప్రపంచంలో మొసళ్లు, కొండచిలువలు అత్యంత భయంకరమైన వేటగాళ్లుగా ప్రసిద్ధి చెందాయి. ఈ రెండు జంతువుల దాడి శైలి, ఎరను పట్టే తీరు, వేటను ముగించే పద్ధతి పూర్తిగా భిన్నమైనప్పటికీ, రెండింటిలోనూ తమదైన శక్తి, చాకచక్యం, అద్భుతమైన సహజ వేట నైపుణ్యం ఉంటుంది. మొసలి నోటిలో ఏదైనా పడితే ప్రాణాలతో బయటపడటం చాలా కష్టం. అలాగే కొండచిలువ తన ప్రత్యర్థిని ఒళ్లంతా చుట్టి బిగించిన వెంటనే శ్వాస ఆడకుండా చేసి పూర్తిగా వశం చేసుకుంటుంది. అలాంటి ఈ రెండు బలమైన సరీసృపాలు ఒకే చోట ఎదురుపడితే ఏం జరుగుతుందో ఊహించడమే భయంకరంగా ఉంటుంది.
— Damn Nature You Scary (@AmazingSights) November 28, 2025
ఇటీవల సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్న ఒక వీడియో ఈ ప్రకృతి పోరాటాన్ని ప్రత్యక్షంగా చూపించింది. ఆ వీడియోలో ఒక మొసలి నీటి ఒడ్డున ఉన్నప్పుడు, ఒక పెద్ద కొండచిలువ దాని దారిని దాటుతూ కనిపిస్తుంది. క్షణాల్లోనే ఈ రెండు మహాశక్తులు ఒకదానిని ఒకటి గుర్తించుకుని ఢీకొనే కోపంతో ముందుకు సాగుతాయి. మొదట కొండచిలువ తన శరీరం మొత్తం వంపుతిరిగి మొసలిని చుట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ మొసలి వేగంగా స్పందించి వెంటనే పాము మధ్యభాగాన్ని తన ఉక్కు పళ్లతో గట్టిగా పట్టుకుంటుంది.
మెుసలి పట్టులో పడిన కొండచిలువ తన శక్తంతా వెచ్చించి ప్రతిదాడికి ప్రయత్నించినా, మొసలి పట్టిన పట్టు నుంచి బయటపడలేకపోతుంది. కొండచిలువ శరీరం మొత్తం గట్టిగా వంగిపోయి బిగించే ప్రయత్నం చేసినా.. మొసలి తన బలమైన దవడలతో ముందే తన ఆధిపత్యాన్ని చూపిస్తుంది. ఈ పోరాటం సుమారు 40 సెకన్ల పాటు సాగుతుంది. వీడియోలో చివరికి ఏమైందన్నది చూపించకపోయినా.. మొసలి పట్టు ఎంత బలమో చూస్తే దాని ఆధిపత్యం స్పష్టంగా అర్థమవుతుంది.
ఈ అమోఘమైన ప్రకృతి పోరాట వీడియోను ‘AmazingSights’ అనే ఎక్స్ హ్యాండిల్ షేర్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయ్యింది. నవంబర్ 28 నాటికి ఆ వీడియోకు 6 లక్షలకుపైగా వ్యూస్ రావడం, వేలల్లో లైకులు పడటం అది ప్రజల్లో ఎంత ఆసక్తిని రేకెత్తించిందో చూపిస్తుంది. చాలా మంది నెటిజన్లు ‘ప్రకృతి శక్తుల మధ్య జరిగిన అద్భుత పోరాటం’, ‘ఇది రెండు పవర్ ఫుల్ సృష్టుల మధ్య అసలు యుద్ధం’ అంటూ స్పందించారు.
ALSO READ: Hot Water: ఉదయాన్నే గోరు వెచ్చని నీళ్లలో కాసింత నెయ్యి కలిపి తాగితే..





