
Andhra Pradesh Rains: ఆంధ్రప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలకు తోడు, వాయవ్య బంగాళాఖాతంలో ఉపరిత ద్రోణి ఏర్పడ్డంతో పెద్ద మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, జార్ఖండ్ మీదుగా సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి విస్తరించి ఉన్నట్లు వెల్లడించారు. ఉత్తర కోస్తా, యానంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందన్నారు.
నేడు ఏపీలో వర్షాలు పడే జిల్లాలు
ఇవాళ ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఇతర జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. అటు రాయసీమలోనూ వానలు పడే అవకాశం ఉందన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడనున్నట్లు వెల్లడించారు. వరుసగా మూడు రోజుల పాటు వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు.
అనుకున్న స్థాయిలో కురవని వానలు
నిజానికి ఆంధ్ర ప్రదేశ్ లో జూన్ లో వర్షాలు భారీగా పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. కానీ, అనుకున్న స్థాయిలో వానలు పడలేదు. జులైలో వానలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే, అనుకున్న స్థాయిలో వానలు పడుతాయో? లేదో? అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో పెద్ద మొత్తంలో వర్షాలు కురిసిన పరిస్థితి లేదు. ఈ నెలలోనైనా వానలు పడాలని కోరుకుంటున్నారు.
Read Also: తెలంగాణలో భారీ వర్షాలు.. ఇవాళ ఏ జిల్లాల్లో కురుస్తాయంటే?