జాతీయం

అమిత్ షాతో డిబేట్ చేయను, జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

Sudarshan Reddy Reaction: ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి  ఓ నక్సల్స్ సానుభూతి పరుడు అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్పందించారు. సల్వాజుడుం మీద తీర్పు తాను వ్యక్తిగతంగా ఇవ్వలేదని, సుప్రీంకోర్టు ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఏదైనా డిబేట్ చేస్తే డీసెన్సీ ఉండాలన్న ఆయన, ఈ విషయంతో తాను అమిత్ షాతో డిబేట్ చేయాలనుకోవడం లేదన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలను రెండు వ్యక్తుల మధ్య పోటీగా చూడరాదన్నారు. రెండు సిద్ధాంతాల మధ్య పోటీగానే చూడాలని సుదర్శన్ రెడ్డి వివరించారు.

సుదర్శన్ రెడ్డి గురించి అమిత్‌షా ఏమన్నారంటే..

తాజాగా కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇచ్చిన సల్వాజుడం తీర్పుతో వామపక్ష తీవ్రవాదం బలపడిందని ఆరోపించారు. నక్సలైట్లకు గట్టి మద్దతుదారుడైన సుదర్శన్‌ రెడ్డిని విపక్ష  ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసుకుందన్నారు. చత్తీస్‌ గఢ్‌ లో నక్సలైట్లపై పోరాటానికి గిరిజన యువకులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సల్వా జుడుం చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం అంటూ 2011లో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన ఆ తీర్పు ఇవ్వకుంటే, సల్వాజుడం అమల్లో ఉంటే నక్సలైట్ల ఉద్యమం 2020 నాటికే అంతమయ్యేదన్నారు. వామపక్షాల ఒత్తిడితోనే కాంగ్రెస్ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌ రెడ్డిని ఎంపిక చేసిందని ఆరోపించారు.

ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ బరిలోకి దిగారు. ఇండియా కూటమి బి.సుదర్శన్‌ రెడ్డిని పోటీకి దింపింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. అదే రోజు ఫలితాలు విడుదల అవుతాయి.

Back to top button