అమెరికా అధ్యక్షుడిగా ఇప్పటి వరకు ఏకంగా 8 యుద్ధాలను ఆపినా, తనకు నోబెల్ బహుమతి ఇవ్వలేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్‌కు ట్రంప్ ఓ లేఖ రాశారు. ఇకపై శాంతి గురించి మాత్రమే ఆలోచించాల్సిన అవసరం తనకు లేదని నిర్ణయించుకున్నానని ట్రంప్ లేఖలో వెల్లడించారు. తాజాగా ఆ లేఖ బయటకు లీక్ కావడంతో సంచలనం కలిగిస్తోంది.
ఇకపై శాంతి గురించి ఆలోచించను!
శాంతి ఎల్లప్పుడూ అత్యంత ముఖ్యమైనది అయినప్పటికీ, ఇకపై తాను ఆ దిశగా ఆలోచించనని ట్రంప్ తేల్చి చెప్పారు. అమెరికాకు ఏది ప్రయోజనకరమో దాని గురించి మాత్రమే తాను ఆలోచిస్తానని చెప్పారు. తనకు నోబెల్ బహుమతి రానందునే ప్రపంచ వ్యవహారాల పట్ల తన దృక్పథం మారిందని ఆ లేఖలో ట్రంప్ తెలిపారు. నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడం వల్ల కలిగిన నిరాశ నుంచే గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాన్ని ప్రారంభించానని ఆ లేఖ ద్వారా ట్రంప్ పరోక్షంగా అంగీకరించారని పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్ వెల్లడించింది.
ట్రంప్ నుంచి లేఖ వచ్చినట్లు నార్వే ప్రకటన
అటు అమెరికా అధ్యక్షుడి నుంచి తాను ఓ లేఖను అందుకున్నట్టు నార్వే ప్రధాన మంత్రి స్టోర్ వెల్లడించారు. నార్వే, ఫిన్లాండ్, ఇతర ఐరోపా దేశాలపై సుంకాలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్‌తో కలిసి తాను ట్రంప్‌నకు ఒక లేఖ పంపానని తెలిపారు. ఆ లేఖకు ప్రతిస్పందనగా ట్రంప్ తన అసంతృప్తిని వెల్లడించారని స్టోర్ తెలిపారు. ట్రంప్ నుంచి తనకు వచ్చిన లేఖలో ఉన్న విషయాలను ఆయన వెల్లడించారు.





