
Savings: ఐదేళ్ల కిందట వరకు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు అంటే అరుదుగా కనిపించే పరిస్థితి. మొత్తం వాహనాల్లో వాటి వాటా ఒక శాతం కూడా ఉండేది కాదు. కానీ కాలం మారింది. ప్రజల ఆలోచనల్లో పెద్ద మార్పు వచ్చింది. నేడు దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వాటా దాదాపు మూడున్నర శాతానికి చేరుకుంది. ఇది సాధారణమైన పెరుగుదల కాదు. చాలా వేగంగా జరిగిన పరిణామం. అప్పట్లో EVలకు ఛార్జింగ్ సదుపాయాలు పరిమితంగా ఉండేవి. ధరలు ఎక్కువగా ఉండేవి. మోడళ్ల సంఖ్య కూడా చాలా తక్కువ. ఈ కారణాల వల్ల కొనుగోలుదారులు వెనకడుగు వేసేవారు.
ఇప్పటి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. నగరాల్లోనే కాదు.. చిన్న పట్టణాల్లోనూ ఛార్జింగ్ స్టేషన్లు పెరిగాయి. అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లలో కూడా చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు అవుతున్నాయి. దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ రంగంలోకి వచ్చి కొత్త కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. వీటికి తోడు ధరలు కూడా కొంత తగ్గాయి. ఈ పరిణామాలన్నీ కలిసి ప్రజల దృష్టిని ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లించాయి.
అయితే చాలా మందిలో ఇంకా ఒక ప్రశ్న మిగిలే ఉంది. నిజంగా ఎలక్ట్రిక్ వాహనం కొనడం ఆర్థికంగా లాభమా? పెట్రోల్ లేదా డీజిల్ కార్లతో పోలిస్తే ఎంత వరకు ఆదా అవుతుంది? ఈ సందేహాలకు సమాధానం వెతుకుతున్నవారికోసమే ఈ విశ్లేషణాత్మక కథనం.
పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ల ధర కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కానీ నిర్వహణ ఖర్చును పరిగణనలోకి తీసుకుంటే ఎలక్ట్రిక్ కారే చాలా చౌకగా మారుతుంది. ఇక్కడే నిపుణులు ఒక ఆసక్తికరమైన సూచన చేస్తున్నారు. కొత్త పెట్రోల్ కారు కొనడం కంటే, సెకండ్ హ్యాండ్ లేదా ప్రీఓన్డ్ ఎలక్ట్రిక్ కారు కొనడం మరింత స్మార్ట్ నిర్ణయమని చెబుతున్నారు. ఎందుకంటే ఎలక్ట్రిక్ కార్ల విలువ వేగంగా తగ్గిపోతుంది. అదే సమయంలో వాటి నిర్వహణ ఖర్చు మాత్రం చాలా తక్కువగా ఉంటుంది.
ఇటీవల హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ప్రీఓన్డ్ ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. 2020లో సుమారు రూ.12 లక్షల ధర ఉన్న ఒక ఎలక్ట్రిక్ కారు.. ఇప్పుడు రూ.5.5 లక్షల నుంచి రూ.6.5 లక్షల మధ్యలో దొరుకుతోంది. ఇది మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఆకర్షణగా మారింది. కొత్త ఫీచర్లు తరచూ వస్తుండటంతో సంపన్నులు అప్‌డేటెడ్ మోడళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా 3 నుంచి నాలుగేళ్లలోపే పాత ఎలక్ట్రిక్ కార్లు సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లోకి వస్తున్నాయి.
ఇది మధ్యతరగతి వారికి బాగా కలిసి వస్తోంది. సెకండ్ హ్యాండ్ పెట్రోల్ కారు కొని అధిక ఇంధన వ్యయాన్ని భరించాల్సిన అవసరం లేకుండా, తక్కువ ధరకు ఎలక్ట్రిక్ కారు కొనుక్కుని తక్కువ ఖర్చుతో వినియోగించుకునే అవకాశం లభిస్తోంది. నెలకు సగటున 1000 కిలోమీటర్లు ప్రయాణించే వ్యక్తి పెట్రోల్ కారులో దాదాపు రూ.6,500 నుంచి రూ.7,000 ఇంధనానికి ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే ఎలక్ట్రిక్ కారులో అయితే ఒక కిలోమీటర్‌కు సుమారు 1.80 పైసల ఖర్చుతో నెలకు రూ.1,500 నుంచి రూ.2,000 సరిపోతాయి. అంటే నెలకు దాదాపు రూ.5,000 వరకు ఆదా అవుతుంది.
అదే విధంగా సర్వీసింగ్ విషయంలోనూ ఎలక్ట్రిక్ కారుకు పెద్దగా ఖర్చు ఉండదు. ఇంజన్ ఆయిల్ మార్పు అవసరం ఉండదు. క్లచ్, గేర్ బాక్స్ లాంటి భాగాలే ఉండవు. అందువల్ల ఏడాదికి రూ.2,000 నుంచి రూ.5,000 సర్వీసింగ్‌కు సరిపోతాయి. పెట్రోల్ కారుకు మాత్రం ఏడాదికి సగటున రూ.12,000 వరకు ఖర్చు అవుతుంది. ఐదేళ్ల లెక్కలో చూస్తే ఈ వ్యత్యాసం లక్షల రూపాయల్లోకి చేరుతుంది.
ఎలక్ట్రిక్ కార్ల విషయంలో చాలామందికి బ్యాటరీపై ఆందోళన ఉంటుంది. బ్యాటరీ త్వరగా డ్యామేజ్ అవుతుందేమో, అగ్ని ప్రమాదాల ముప్పు ఉందేమో అన్న భయాలు కనిపిస్తాయి. కానీ ప్రస్తుతం కంపెనీలు అత్యాధునిక సాంకేతికతతో బ్యాటరీలను తయారు చేస్తున్నాయి. చాలా కంపెనీలు ఎనిమిదేళ్ల వారంటీ లేదా 1,60,000 కిలోమీటర్ల వరకు బ్యాటరీ వారంటీ ఇస్తున్నాయి. నాలుగేళ్ల వినియోగం తర్వాత బ్యాటరీ పనితీరు కేవలం 8 నుంచి 12 శాతం మాత్రమే తగ్గుతుందని యూజర్ డేటా చెబుతోంది. అందరూ అనుకునేలా 40 లేదా 50 శాతం తగ్గిపోవడం నిజం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మూడేళ్లు వాడిన ఎలక్ట్రిక్ కారు కొన్నా మరో మూడు నుంచి నాలుగేళ్లు అదే బ్యాటరీతో నిర్భయంగా వినియోగించుకోవచ్చు. ఒకవేళ భవిష్యత్తులో బ్యాటరీ మార్చాల్సి వచ్చినా, కారును బట్టి రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కానీ ఐదేళ్లలో ఇంధనం, నిర్వహణలో మిగిలే మొత్తం చూస్తే బ్యాటరీ ఖర్చును కూడా సులభంగా కవర్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పట్టణాల్లో రోజూ కార్యాలయానికి వెళ్లి రావడం, రోజుకు 80 కిలోమీటర్లలోపు ప్రయాణం చేసే వారికి ప్రీఓన్డ్ ఎలక్ట్రిక్ కారు చాలా అనుకూలం. నెలకు కనీసం 700 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ప్రయాణించే వారికి ఇది మరింత లాభసాటి. ఇంట్లో ఛార్జింగ్ సదుపాయం ఉన్నవారు, రూ.5 నుంచి రూ.8 లక్షల పెట్టుబడి పెట్టగలిగే వారు ఈవీ వైపు ఆలోచించవచ్చు.
అయితే హైవేలపై ఎక్కువగా ప్రయాణించే వారు, గ్రామీణ లేదా మారుమూల ప్రాంతాలకు తరచూ వెళ్లాల్సిన వారికి పెట్రోల్ కారు ఇంకా అనుకూలంగానే ఉంటుంది. అలాగే ఇంట్లో ఛార్జింగ్ సదుపాయం లేని వారు, నెలకు 500 కిలోమీటర్లకు మించి ప్రయాణం చేయని వారు పెట్రోల్ కారునే ఎంచుకుంటే పెద్దగా నష్టం ఉండదు. వినియోగం తక్కువగా ఉన్నప్పుడు విలువ వేగంగా తగ్గే ఎలక్ట్రిక్ కారుతో పోలిస్తే పెట్రోల్ కారు వీరికి సరైన ఎంపికగా మారుతుంది.
ALSO READ: Hollywood: అవతార్-3కి షాకింగ్ రివ్యూస్.. ఇచ్చిన సంస్థలు ఇవే..





