ఆంధ్ర ప్రదేశ్జాతీయంతెలంగాణ

Family Politics: రాజకీయ కుటుంబాల్లో.. కుటుంబ రాజకీయాల చిచ్చు!

శత్రువులు ఎక్కడో పుట్టరు.. చెల్లెళ్లు, కూతుళ్ల రూపంలో ఇంట్లోనే తిరుగుతుంటారనే ఓ సినిమా డైలాగ్.. నిజ జీవితంలోనూ అక్షర సత్యం అవుతోంది. ఇప్పటికే షర్మిల, కవిత తమ కుటుంబాలకు తలనొప్పి కాగా, తాజాగా ఈ లిస్టులో లాలూ కూరుతు రోహిణి చేరింది.

Lalu Yadav Family Politics: రాజకీయ కుటుంబాల్లో.. కుటుంబ రాజకీయాలు కొత్తేమీ కాదు. అవి బటపడి బయటకు వెళ్లిన సందర్భాలకూ కొదవేమీ లేదు. ఏపీలో ఇప్పటికే తన పుట్టిల్లును, అన్నను విభేదించి బయటకు వచ్చిన షర్మిల గానీ, తెలంగాణలో అన్న, బావను టార్గెట్ చేస్తున్న కవిత గానీ ఇదే కోవలోకి వస్తారు. తాజాగా ఈ లిస్టులో మరో ఆడపడుచు చేరింది. షర్మిల, కవిత మాదిరిగానే బీహార్‌లో ఆర్జేడీ చీఫ్‌ లాలూప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె రోహిణి ఆచార్య కుటుంబం నుంచి బయట అడుగు పెట్టింది. తేజస్వియాదవ్‌, ఆయన అనుచరులు కలిసి తనను దారుణంగా అవమానించారంటూ తీవ్ర ఆరోపణలు  చేసింది.  ఇకపై ఆ కుటుంబంతో, ఆర్జేడీతో తన సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో, రోహిణి  ముగ్గురు చెల్లెళ్లు కూడా పట్నాలోని లాలూ నివాసాన్ని వదిలేసి ఢిల్లీకి వెళ్లిపోయారు.

బీహార్ పరాభవం తర్వాత రోజే కీలక ప్రకటన

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైన మరుసటి రోజే లాలూ కుటుంబంలో చిచ్చు మొదలయ్యింది. ఆర్జేడీని, లాలూ కుటుంబాన్ని వీడుతున్నట్టు రోహిణి ఆచార్య సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తన సోదరుడు తేజస్వియాదవ్‌, ఆయన సన్నిహితులు తనను తీవ్రంగా అవమానించారని, కొట్టడానికి సిద్ధమయ్యారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ దారుణ ఓటమికి తేజస్వియాదవ్‌ సన్నిహితులు హరియాణాకు చెందిన ఎంపీ సంజయ్‌ యాదవ్‌, యూపీకి చెందిన రమీజ్‌ కారణమని ఆరోపించింది. 47 ఏళ్ల రోహిణి ఆచార్య లాలూ రెండో కుమార్తె. వైద్యురాలు అయిన ఆమె భర్తతో కలసి మొదట్లో సింగపూర్‌ లో సెటిల్ అయ్యారు. లాలూ రెండు కిడ్నీలు దెబ్బతినడంతో.. ఆమె తన కిడ్నీని తండ్రికి ఇచ్చారు. కొంతకాలం నుంచి పట్నాలోనే ఉంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సరణ్‌ స్థానంలో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తాజాగా కుటుంబానికి దూరమయ్యారు.

లాలూకు ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు

లాలూకు మొత్తం తొమ్మిది మంది సంతానం. ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో రెండో కుమార్తె రోహిణి. ఆమె బయటకు వచ్చిన నేపథ్యంలో, లాలూ మరో ముగ్గురు కుమార్తెలు రాజ్యలక్ష్మి, రాగిణి, చందా కూడా పట్నా నివాసం నుంచి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఇప్పటికే రాజకీయ కారణాలతో లాలూ పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన జనశక్తి జనతాదళ్‌ (జేజేడీ) పేరిట పార్టీ స్థాపించారు. ఇటీవలి ఎన్నికల్లో మహువా నుంచి పోటీ చేసి, ఓడిపోయారు.

Back to top button