జాతీయంతెలంగాణ

ఇండిగో ఫ్లైట్ లో సాంకేతిక సమస్య, చెన్నైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్!

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత.. ప్లైట్ ప్యాసింజర్లలో భయం నెలకొన్నది. ఆ ప్రమాదం తర్వాత పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తిన నేపథ్యంలో విమానం ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. గత వారం పది రోజులుగా పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక సమస్యలు రావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్నాయి.

ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

తాజాగా ఇండిగో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. చెన్నై నుంచి మధురైకి బయల్దేరిన ఇండిగో విమానంలో టెక్నికల్‌ ఇష్యూస్ వచ్చాయి. వెంటనే వెనుదిరిగి మళ్లీ చెన్నైలోనే అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. ఈ విమానం 68 మంది ప్రయాణికులతో శుక్రవారం ఉదయం 6:44 గంటలకు చెన్నై నుంచి మధురైకి బయల్దేరింది. విమానం టేకాఫ్‌ అయిన 30 నిమిషాల తర్వాత సాంకేతిక సమస్య ఏర్పడింది. వెంటనే అలర్ట్ అయిన పైలట్‌ సమస్యను ఏటీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విమానాన్ని తిరిగి చెన్నైకి తీసుకొచ్చేందుకు అనుమతి తీసుకున్నాడు.  ఉదయం 7:17 గంటలకు విమానం చెన్నై ఎయిర్‌ పోర్ట్‌ లో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది.

మరో విమానంలో ప్రయాణీకుల తరలింపు!

విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా సేఫ్ గా ల్యాండ్ కావడం పట్ల ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత విమానంలోని ప్రయాణీకులను కిందకుదించి సమస్యను పరిష్కరిస్తున్నారు ఇంజినీర్లు. మరోవైపు ప్రయాణీకులను ఇంకో విమానంలో తరలించేందుకు ఇండిగో సంస్థ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ ఘటనపై ఇండిగో విమానయాన సంస్థ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Read Also: 16 ఇంటర్నేషనల్ విమానాలు నిలిపివేత, ఎందుకంటే?

Back to top button