తెలంగాణ

హైదరాబాద్ ను ముంచెత్తిన భారీ వర్షం.. నీట మునిగిన పలు ప్రాంతాలు, వాహనదారుల నరకయాతన!

Hyderabad Rain: కుండపోత వర్షం హైదరాబాద్ ను అతలాకుతలం చేసింది. భారీ వర్షం కారణంగా నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడ చూసినా వర్షపు నీరు నిలిచిపోయింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, షేక్‌పేట్‌, మణికొండ, హైటెక్‌ సిటీ, కూకట్‌పల్లి, మూసాపేట, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌ నగర్‌, మధురానగర్‌,  మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, ఖైరతాబాద్‌, కోఠి, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్థమైంది. నగరంలో భారీగా వర్షపాతం నమోదైంది. ఖాజాగూడలో 12 సెంటీ మీటర్లు, ఎస్‌ఆర్‌ నగర్‌ 11, ఖైరతాబాద్‌ 11, సరూర్‌నగర్‌లో 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

వాహనదారుల నరకయాతన  

రోడ్లపైకి వరదనీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ భారీగా స్తంభించిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సైబర్‌ సిటీ ట్రాఫిక్‌ లో చిక్కుకుంది. మాదాపూర్‌, హైటెక్‌సిటీ, ఐకియా, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఖైరతాబాద్‌ నుంచి జూబ్లీహిల్స్‌, కొండాపూర్‌, మియాపూర్‌- లింగంపల్లి మార్గాల్లో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.  రాత్రి 7 గంటల నుంచి నానక్‌ రామ్‌ గూడ- ఖాజాగూడ సర్కిల్‌ లో చిక్కుకున్న వాహనదారులు ఇళ్లకు వెళ్లడానికి 4 గంటలు నరకయాతన అనుభవించారు.

అత్యాధిక వర్షపాతం ఎక్కడంటే..

హైదరాబాద్‌ సరిహద్దు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్‌లో అత్యధికంగా 153 మి.మీ వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా శాలిగౌరారంలో 141.5 మి.మీ, గచ్చిబౌలిలోని ఖాజాగూడ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వద్ద 133.8 మి.మీ, యాదాద్రి జిల్లాలోని అడ్డగూడురులో 131.మి.మీ వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ అధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం ఏర్పడింది. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. నల్లగొండ, యాదాద్రి, నాగర్‌ కర్నూలు, వనపర్తి జిల్లాలో అక్కడక్కడా  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ముందని.. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Read Also: విధులు మరిచి మద్యం విందులో మునిగిన విద్యుత్ అధికారులు.!

Back to top button