దేశ వ్యాప్తంగా 1200 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) ప్రకటించింది. ఎయిర్ పోర్టుల్లో సాంకేతిక సమస్యల కారణంగానే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. గత కొద్ది రోజులుగా జీపీఎస్ స్ఫూపింగ్ కు దుండగులు ప్రయత్నిస్తున్నారు. ఎయిర్ పోర్టుల కమ్యూనికేషన్ ను దెబ్బతీసి.. పెద్ద ఎత్తున విమాన ప్రమాదాలకు కారణం అయ్యేందుకు కుట్ర చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనలు జరగడంతో, ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
చెకిన్ వ్యవస్థలో సాంకేతిక సమస్యలు
దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లోని చెక్ ఇన్ వ్యవస్థల్లో బుధవారం ఉదయం అంతరాయం తలెత్తింది. పలు విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. ఈ అంతరాయానికి కారణాలను అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు విమానాల రద్దుకు సంబంధించి, డీజీసీఏ నిర్ణయంపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా 1200 విమాన సర్వీసులు రద్దు కావడంతో ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇలా విమానాలను రద్దు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇండిగో సర్వీసుల రద్దు డీజీసీఏ ఆగ్రహం
గత కొద్ది రోజుల్లో ఇండిగో విమానం 1,232 సర్వీసులను రద్దు చేసినట్లు డీజీసీఏ తెలిపింది. దేశంలోనే అతిపెద్ద పౌరవిమానయాన సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న ఇండిగో.. పలు కారణాలతో విమాన సర్వీసులను నిలిపివేసినట్లు ప్రకటించింది. అంతర్గత సమస్యల కారణంగా గత కొన్ని రోజుల్లోనే ఏకంగా 1,232 సర్వీసులను రద్దు చేసినట్లు డీజీసీఏ తెలిపింది. సిబ్బంది కొరతతో 755 సర్వీసులు, ఏటీసీ సమస్యలతో 92 సర్వీసులు నిలిచిపోయినట్లు వెల్లడించింది. సర్వీసుల రద్దకు సంబంధించి డీజీసీఏ ప్రధాన కార్యాలయానికి స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఇండిగో యాజమాన్యాన్ని ఆదేశించింది.
సర్వీసుల రద్దుపై ప్రయాణీకుల ఆగ్రహం
హైదరాబాద్, బెంగళూరు, ముంబైలతోపాటు పలు విమానాశ్రయాల్లో మంగళ, బుధవారాల్లో ఇండిగో సర్వీసులు రద్దు కావటంతో ప్రయాణికులు ఆ సంస్థ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఫొటోలు, వీడియోలు వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో, ప్రయాణికులకు క్షమాపణ చెబుతూ ఇండిగో ఒక ప్రకటన విడుదల చేసింది. “సాంకేతిక, నిర్వహణాపరమైన సమస్యలు, విమానాశ్రయాల్లో నెలకొన్న రద్దీ కారణంగా గత రెండు రోజులుగా మా సర్వీసుల్లో అంతరాయం తలెత్తింది. దీనిని నివారించటానికి చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైన చోట్ల ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. రీఫండ్ ఇస్తున్నాం” అని ప్రకటించింది.





