
పెళ్లి చేసుకుంటానని నమ్మించి చివరకు మాట తప్పడంతో ఒక యువతి కుటుంబంతో కలిసి ప్రియుడి ఇంటి ముందే న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో కలకలం రేపింది. రామచంద్రాపురం ప్రాంతానికి చెందిన యువతి, అదే గ్రామానికి చెందిన కరణం భానుప్రకాష్ మధ్య కొంతకాలంగా ప్రేమ సంబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని యువకుడు నమ్మించడంతో యువతి అతడిపైనే భవిష్యత్తు ఆశలు పెట్టుకుంది. అయితే 8 నెలల క్రితం యువతికి చేబ్రోలు గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయమై, కట్నకానుకలు కూడా ఇరువైపులా ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న భానుప్రకాష్ తానే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ వివాహాన్ని అడ్డుకున్నాడు.
దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరు కుటుంబాల పెద్దలు సమావేశమై చర్చించారు. పెద్దల సమక్షంలో యువతీ, యువకుడికి దండలు మార్చించి వివాహం ఖాయం చేసినట్లు ప్రకటించారు. యువకుడికి అన్నయ్య ఉండటంతో ముందుగా అతనికి వివాహం జరిపిన తర్వాత చిన్నవాడైన భానుప్రకాష్‌కు పెళ్లి చేస్తామని యువకుడి తండ్రి హామీ ఇచ్చారు. ఇందుకు 6 నెలల గడువు కూడా నిర్ణయించారు. అయితే 6 నెలలు గడిచినా పెద్ద కుమారుడికి వివాహం జరగకపోవడమే కాకుండా, అతడిని గల్ఫ్ దేశానికి పంపించడంతో యువతికి అనుమానాలు మొదలయ్యాయి. ఈ పరిణామాలతో యువతి గత కొంతకాలంగా భానుప్రకాష్‌ను నిలదీయడం ప్రారంభించింది.
ఈ క్రమంలో యువకుడు ఆమెకు దూరంగా ఉండటం, ఫోన్‌లకు స్పందించకపోవడం, ముఖం చాటేయడంతో పరిస్థితి చేయి దాటిపోతుందనే ఆందోళన యువతి కుటుంబాన్ని వెంటాడింది. చివరకు సోమవారం యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి భానుప్రకాష్ ఇంటికి వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నించింది. అయితే అక్కడి నుంచి నిర్లక్ష్యమైన సమాధానాలు రావడంతో ఆవేదనకు గురైన యువతి, కుటుంబసభ్యులతో కలిసి ప్రియుడి ఇంటి ముందే నిరసనకు దిగింది. పెద్దల సమక్షంలో వివాహం ఖాయం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ తనకు న్యాయం చేయాలని ఆమె కన్నీటి పర్యంతమైంది. ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారగా, బాధిత యువతికి న్యాయం చేయాలంటూ స్థానికులు కూడా స్పందిస్తున్నారు.
ALSO READ: ‘MNCల కన్నా చిన్న కంపెనీలే మంచివి’





