తెలంగాణ

Panchayat Elections: ఇవాళే తుది విడత పంచాయతీ ఎన్నికలు, పకడ్బందీ ఏర్పాట్లు!

రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొత్తం 182 మండలాల్లోని గ్రామపంచాయతీల్లో ఇవాళ సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి.

Final Phase of Panchayat Elections: రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇవాళ్టితో ఎన్నికల ప్రక్రియ దాదాపు ముగిసిపోనుంది. 182 మండలాల్లో సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, ఆ ప్రక్రియ ముగియగానే ఫలితాలను ప్రకటించారు.

సర్పంచ్ బరిలో 12,652 మంది అభ్యర్థులు

ఈ విడతలో 3,752 సర్పంచ్‌ స్థానాలకు 12,652 మంది అభ్యర్థులు, 28,410 వార్డులకు 75,725 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మొత్తం 36,483 పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో 53,06,401 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. బుధవారం ఉదయమే పోలింగ్‌ ప్రారంభం అవుతుండటంతో.. రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్న సాయంత్రమే ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. రాత్రికల్లా సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. అన్నిచోట్లా తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఓట్ల కోసం భారీగా తాయిలాలు

పోలింగ్‌కు ముందు రోజు కావడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు మంగళవారమే భారీగా పంపకాలు చేపట్టారు. డబ్బుతోపాటు చీరలు, మద్యం, మాంసం పంపిణీ చేయడం కనిపించింది. జనరల్‌ స్థానాలతోపాటు రిజర్వుడ్‌ పంచాయతీల్లోనూ ఈసారి భారీగా పంపకాలు జరిగాయని స్థానికులు తెలిపారు. చాలా చోట్ల ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2వేలు ఇస్తుంటే.. పోటీ ఎక్కువగా ఉన్న చోట్ల రూ.5వేలు ఇచ్చినట్లు తెలిసింది.

నల్లగొండ జల్లా దేవరకొండ డివిజన్‌ లోని ఓ గిరిజన తండా పంచాయతీలో పోటీ ఎక్కువగా ఉందని.. దీనితో ఓ అభ్యర్థి 60 ఓట్లున్న ఒక వర్గం వారి కులదైవం గుడి నిర్మాణానికి రూ.4 లక్షలు ఇచ్చారని స్థానికులు తెలిపారు. మరో అభ్యర్థి కూడా ఓటుకు రూ.5 వేల వరకు పంచుతున్నారని వెల్లడించారు. ఇక జిల్లాలోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన కొండమల్లేపల్లిలో సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు విపరీమైన పోటీ నెలకొంది. దీనితో పోటాపోటీగా సర్పంచ్‌ అభ్యర్థులు ఓటుకు రూ.5 వేల వరకు, వార్డు అభ్యర్థులు రూ.4 వేల వరకు పంచారని స్థానికులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button