ఆంధ్ర ప్రదేశ్

డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల పోరు - ఒంటరైన చంద్రబాబు..!

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌)… దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే… దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించాయి. ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం… జనాభాను పెంచుకుంటూ పోయాయి. ఇప్పుడు జనాభా ఆధారంగా… లోక్‌సభ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తే.. దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య తగ్గుతుంది.. ఉత్తరాది రాష్ట్రాల్లో పెరుగుతుంది. దీని వల్ల దక్షిణాదిలో బలం లేని బీజేపీ లాభపడుతుంది. అంతేకాదు… దక్షిణాదికి రాజకీయంగా ప్రాధాన్యత తగ్గుతుంది. దీనిపై ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

అందుకే.. డీలిమిటేషన్‌పై పోరుకు దక్షిణాది రాష్ట్రాలు అయితే ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ ఒక్కటవుతున్నాయి. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే… ఇక్కడ ఒక చిక్కు వచ్చి పడింది. దక్షిణాది రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాలు ఇండియా కూటమి పార్టీలే. తమిళనాడులో డీఎంకే, కేరళ సీపీఎం, కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎన్డీయే (NDA) ప్రభుత్వం కొనసాగుతోంది. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌.. కేంద్రానికి వ్యతిరేకంగా డీలిమిటేషన్‌పై మాట్లాడలేకపోతున్నారు. డీలిమిటేషన్‌పై పోరులో ఏపీ కలిసిరాలేకపోతోంది. దీంతో… దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో… ఏపీ ఒంటరిగా మిగిలిపోనుంది.

డీలిమిటేషన్‌ జరిగితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుంది. ఐదు నుంచి ఆరు లోక్‌సభ నియోజకవర్గాలు తగ్గే అవకాశం ఉంది. అయినా.. ప్రస్తుతం ఏమీ మాట్లాడలేని పరిస్థితి చంద్రబాబుది. పక్క రాష్ట్రమైన తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం… డీలిమిటేషన్‌పై గట్టిగానే పోరాడుతున్నారు. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే… దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని అంటున్నారు. రేవంత్‌రెడ్డి.. రాజకీయంగా చంద్రబాబు శిష్యుడు. ఆయన కూడా… డీలిమిటేషన్‌పై కేంద్రంతో పోరుకు సిద్ధపడ్డారు. ఒక్క చంద్రబాబు మాత్రమే… ముందుకు రాలేని పరిస్థితి.

డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల నుంచి విమర్శలు రావడంతో… సర్దిచెప్పే ప్రయత్నం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. లోక్‌సభ నియోజకవర్గాల తగ్గింపు ఉండదని… ఆందోళన వద్దని అన్నారాయన. తగ్గింపు లేకపోవడం కాదు… ఉత్తరాదిలో నియోజకవర్గాల సంఖ్య పెంచి.. దక్షిణాదిలో పెరగకపోయినా తమకు నష్టం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటున్నారు. దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాలు డీలిమిటేషన్‌పై పోరుకు సిద్ధమవుతున్నాయి. మరి చంద్రబాబు దారెటు…? దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా… గళం విప్పుతారా..? ప్రస్తుత పరిస్థితుల్లో అది జరగని పని. కలిసి పోరాడలేకపోతే… సీఎం చంద్రబాబు ఒంటరి కాక తప్పదు. ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి …

  1. కర్ణాటకకు కొత్త సీఎం.. కాంగ్రెస్ లో ముసలం?

  2. చిన్నారులను మింగేస్తున్న బోరుబావులు-రాజస్థాన్‌లో ఐదేళ్ల చిన్నారి మృతి

  3. ఏపీ భవిష్యత్‌ జనసేన – ఈ కాన్సెప్ట్‌ వెనకున్న స్ట్రాటజీ ఏంటి…?

  4. వైసిపి కి ఎటువంటి సహాయం చేయకండి… సీఎం వ్యాఖ్యలపై మండిపడ్డ వైసిపి!.. కౌంటర్స్ వేస్తున్న ఇరుపార్టీలు?

  5. పోసానికి 14 రోజుల రిమాండ్‌ – రాజంపేట సబ్‌జైల్లో ఖైదీ నెంబర్‌ 2261 కేటాయింపు

Back to top button