జాతీయం

ఆహా అవిన్యా.. ఏముంది గురూ!.. టాటా నుంచి కళ్లు చెదిరే కారు

టాటా మోటార్స్ భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో మరో కీలక అడుగు వేయబోతోంది.

టాటా మోటార్స్ భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో మరో కీలక అడుగు వేయబోతోంది. ఇప్పటివరకు మాస్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ కార్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాటా.. ఇప్పుడు ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. అద్భుతమైన ఫ్యూచరిస్టిక్ డిజైన్, లగ్జరీ ఫీచర్లు, దీర్ఘ రేంజ్‌తో వచ్చే కొత్త కాన్సెప్ట్ మోడళ్లలో భాగంగా టాటా అవిన్యా EV త్వరలో రోడ్లపైకి రానుంది. భవిష్యత్ ప్రీమియం EV మార్కెట్‌లో టాటా నుంచి ఇది అత్యంత కీలకమైన ఎంట్రీగా ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.

టాటా అవిన్యా EV పూర్తిగా కొత్తగా రూపొందించిన Gen-3 ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడుతుంది. ఈ ప్లాట్‌ఫామ్ అధునాతన బ్యాటరీ టెక్నాలజీ, మెరుగైన రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ఇప్పటివరకు భారత మార్కెట్లో కనిపించిన టాటా EVలకంటే ఇది పూర్తిగా భిన్నమైన అనుభూతిని అందించనుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

అవిన్యా EV బ్రాండ్ కింద మొదటి మోడల్ స్పోర్ట్‌బ్యాక్ రూపంలో 2026 చివరి నాటికి లాంచ్ అవుతుందని ఆటో రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత అవిన్యా X SUV మోడల్ 2027 జూన్‌లో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. అవిన్యా కాన్సెప్ట్‌ను టాటా మోటార్స్ 2022లోనే రివీల్ చేసింది. తాజాగా 2025 ఆటో ఎక్స్‌పోలో అవిన్యా X కాన్సెప్ట్‌ను ప్రదర్శించి, ప్రీమియం EV విభాగంలో తమ లక్ష్యాలను స్పష్టంగా తెలియజేసింది.

ధర విషయానికి వస్తే.. టాటా అవిన్యా EV ప్రీమియం సెగ్మెంట్‌కు చెందిన వాహనంగా ఉండనుంది. దీని అంచనా ఎక్స్-షోరూమ్ ధర రూ.30 లక్షల నుంచి రూ.60 లక్షల మధ్య ఉండవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని వేరియంట్ల ధరలు రూ.35 నుంచి రూ.40 లక్షల వరకు ఉండే అవకాశం ఉండగా, టాప్ ఎండ్ వేరియంట్లు రూ.45 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ధరను కూడా చేరుకోవచ్చని అంచనా. టాటా హారియర్ EV కంటే అవిన్యా ధర స్పష్టంగా ఎక్కువగా ఉండనుంది.

రేంజ్ విషయంలో టాటా అవిన్యా EVపై భారీ అంచనాలే ఉన్నాయి. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని సమాచారం. అడ్వాన్స్‌డ్ బ్యాటరీ టెక్నాలజీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో, దీర్ఘ ప్రయాణాలకు కూడా ఈ కారు అనువుగా మారనుంది. పెర్ఫార్మెన్స్ పరంగా కూడా హై రేంజ్ అవుట్‌పుట్‌ను అందించేలా టాటా దీనిని డిజైన్ చేస్తోంది.

అవిన్యా EV స్పోర్ట్‌బ్యాక్, అవిన్యా X SUV అనే రెండు మోడల్స్‌లో వచ్చినా.. ఫీచర్లు దాదాపు ఒకే విధంగా ఉండే అవకాశం ఉంది. SUV మరియు కూపే లాంటి స్పోర్ట్‌బ్యాక్ సిల్హౌట్‌తో ఇది పూర్తిగా ఫ్యూచరిస్టిక్ లుక్‌ను కలిగి ఉంటుంది. ఐదు మంది సీటింగ్ సామర్థ్యం, పూర్తిగా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో పాటు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉండవచ్చని అంచనా.

ఫీచర్ల విషయంలో టాటా అవిన్యా EV పూర్తిగా లగ్జరీ అనుభూతిని అందించనుంది. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, మల్టిపుల్ స్క్రీన్ సెటప్, సీట్ వెంటిలేషన్, పనోరమిక్ సన్‌రూఫ్, LED హెడ్‌లైట్స్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, హెడ్‌రెస్ట్ స్పీకర్లు వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఆధారిత సిస్టమ్స్, వాయిస్ ఆక్టివేటెడ్ ఫంక్షనాలిటీ కూడా ఇందులో భాగం కానున్నాయి.

డిజైన్ పరంగా అవిన్యా EV టాటా బ్రాండ్‌ను పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్లనుంది. ఫ్యూచరిస్టిక్, మినిమలిస్టిక్ డిజైన్ దీని ప్రధాన ఆకర్షణగా ఉండనుంది. పనోరమిక్ గ్లాస్ రూఫ్, 22 ఇంచ్ అల్లాయ్ వీల్స్, సస్టైనబుల్ మెటీరియల్స్ వినియోగం, ఫుల్ విడ్త్ LED లైట్ బార్, స్ట్రాంగ్ షోల్డర్ లైన్, బ్లాక్ అవుట్ A పిల్లర్స్ వంటి అంశాలు దీనికి ప్రీమియం గుర్తింపును ఇస్తాయి.

ఇంటీరియర్ విషయానికి వస్తే.. లాంజ్ లాంటి అనుభూతిని కలిగించేలా క్యాబిన్‌ను రూపొందించారు. మినిమలిస్ట్ కానీ లగ్జరీ ఫోకస్‌తో ఉండే ఈ ఇంటీరియర్‌లో ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్, ఫ్లాట్ ఫ్లోర్ లేఅవుట్, విశాలమైన లెగ్‌రూమ్, స్వివెలింగ్ ఫ్రంట్ సీట్లు ఉండే అవకాశం ఉంది. ప్రయాణికుల సౌకర్యమే ప్రధాన లక్ష్యంగా ఈ కారు డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

సేఫ్టీ విషయంలో కూడా టాటా ఎక్కడా రాజీపడడం లేదు. అవిన్యా EVలో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ వంటి కీలక భద్రతా ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. లాంచ్ సమయానికి వీటిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ALSO READ: కనుమరుగు కానున్న కరెంట్ తీగలు.. ఇక మీ ఇంటికి వైర్‌లెస్ విద్యుత్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button