
సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘోర పరాజయం మూటగట్టుకున్న భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అరుదైన స్థాయిలో వెనుకబడింది. గౌహతిలో జరిగిన రెండో టెస్టులో 408 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడంతో సిరీస్‌ను పూర్తిగా కోల్పోయిన టీమిండియా, ఈ ఫలితంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. ఒకప్పుడు వరుసగా రెండు సార్లు WTC ఫైనల్‌కు చేరిన భారత్, ఇప్పుడు టెస్టు ఫార్మాట్‌లో స్థిరత్వం కోల్పోయి, పాకిస్తాన్ కంటే కూడా వెనుకబడటం అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
ప్రస్తుతం భారత్ మొత్తం 10 టెస్టులు ఆడి, కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఐదు టెస్టుల్లో పరాజయం పొందగా, ఒక మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఈ ప్రదర్శనతో టీమిండియా విన్నింగ్ పర్సెంటేజ్ 44.44 శాతానికి పడిపోయింది. మరోవైపు కేవలం ఆరు టెస్టులు ఆడిన పాకిస్తాన్ మూడు గెలుపులు, రెండు ఓటములు, ఒక డ్రాతో 52.78 శాతం విన్నింగ్ రేటును నమోదు చేసి నాలుగో స్థానానికి చేరింది. దీనితో పాయింట్ల పట్టికలో భారత్‌పై దాయాది జట్టు ఆధిక్యాన్ని కనబర్చింది.
ప్రస్తుతం WTC పట్టికలో సౌతాఫ్రికా 73.33 శాతం విన్నింగ్ రేటుతో అగ్ర స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా 66.67 శాతం, శ్రీలంక 55.56 శాతం, పాకిస్తాన్ 52.78 శాతం విజయాలతో వరుసలో ఉంటే, భారత్ 44.44 శాతంతో ఐదో స్థానంలో నిలిచింది. ఇటీవలి కాలంలో భారత బ్యాటింగ్ వైఫల్యాలు, బౌలింగ్ అసమర్థత, జట్టు సమన్వయం లోపాలు స్పష్టంగా కనిపించడంతో అభిమానులు జట్టులో వ్యూహాత్మక మార్పులు చేయాలని కోరుతున్నారు. టెస్టు క్రికెట్‌లో మళ్లీ పాత విజయపథం వైపు పయనించడానికి టీమిండియా పునర్నిర్మాణానికి సిద్ధం కావాలని సూచనలు వినిపిస్తున్నాయి.
ALSO READ: largest city India: దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్





