అంతర్జాతీయం

Job Lost: ఆఫీస్ టైమ్ కంటే ముందే వెళ్లి.. జాబ్ పోగొట్టుకున్న యువతి!

టైమ్ కంటే ముందే ఆఫీస్ కు వస్తే ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ, యువతి పని వేళలల కంటే ముందే ఆఫీస్ కు వచ్చిందని తీసేశారు. కారణం ఏంటంటే..

నిజానికి ఎవరైనా ఆఫీస్ టైమింగ్ కంటే ముందే వస్తే, యాజమాన్యం సంతోషిస్తుంది. పని పట్ల వారికి ఉన్న ఇష్టాన్ని కొనియాడుతుంది. కానీ, ఓ యువతి ఆఫీస్ టైమింగ్ కంటే ముందే వస్తుందని ఉద్యోగంలో నుంచి తీసేసింది. ఆమె, తన తొలగింపు అక్రమం అని కోర్టుకెక్కినా ఫలితం దక్కలేదు. కారణం ఏంటంటే..

ఉద్యోగంలో నుంచి తొలగించిన కంపెనీ

స్పెయిన్ కు చెందిన ఓ యువతికి 22 ఏళ్లు. జాబ్‌పై ఇష్టంతో తరచూ ఆఫీసుకు పనివేళల కంటే ముందే వచ్చేది. అలా దాదాపు ఏడాది పాటు ఆమె వ్యవహారం సాగింది. మేనేజ్‌మెంట్ తరచూ ఆమెను హెచ్చరిస్తూనే ఉంది. టైమ్‌కు మాత్రం వస్తే సరిపోతుందని పలుమార్లు చెప్పి చూసింది. అంతముందుగా వస్తే చేయాల్సిన పనులేవీ ఉండవని వివరించే ప్రయత్నం చేసింది. కానీ, ఆమె మాత్రం సంస్థ ఆదేశాలు ఖాతరు చేయలేదు. దీంతో, కంపెనీ ఆమెను తొలగించింది.

కోర్టులో కేసు వేసిన యువతి

కంపెనీ తనను ఉద్యోగంలో నుంచి తీసివేయడంతో.. ఆమె న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కింది. కోర్టులో కేసు వేసింది. కానీ అక్కడా ఆమె వాదనలు నిలవలేదు. పలుమార్లు హెచ్చరించినా యువతి వినలేదన్న సంస్థ వాదనతో కోర్టు ఏకీభవించింది.  టైమ్ కంటే ముందే ఆమె సంస్థ యాప్‌లో లాగిన్ అయ్యేందుకు కూడా ప్రయత్నించినట్టు కంపెనీ మేనేజ్‌మెంట్ కోర్టుకు తెలిపింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు యువతి తొలగింపు సబబేనని తీర్పు వెలువరించింది.

ఆఫీసు నిబంధనలను పాటించనందుకే..

ఆమె త్వరగా ఆఫీసుకు వచ్చినందుకు ఉద్యోగంలోంచి తొలగించలేదని కోర్టు అభిప్రాయపడింది. కేవలం ఆఫీసు నిబంధనలను పాటించనందుకే ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. సంస్థ యాజమాన్యం ఆదేశాలను బేఖాతరు చేయడం కార్మిక చట్టాలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. అయితే, ఈ తీర్పును యువతి పైకోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది. ఈ తీర్పు ప్రస్తుతం స్పెయిన్ లో హాట్ టాపిక్ గా మారింది.

Back to top button