
జీవితం చాలా చిన్నది. కానీ చేయాల్సిన పనులు మాత్రం అంతులేనివి. ప్రతి మనిషికీ రోజుకు సమానంగా లభించే సంపద ఒక్కటే అది సమయం. అయినప్పటికీ మనం ఆ అమూల్యమైన సమయాన్ని ఎలా వినియోగిస్తున్నామన్నది ఆలోచించాల్సిన అంశంగా మారింది. లభించిన 24 గంటల్లో ఎక్కువ భాగం నిద్రకు, కాలక్షేపానికి, అవసరం లేని ముచ్చట్లకు ఖర్చవుతోంది. ఫలితంగా వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ముందుకు సాగాల్సిన ప్రగతి పథంలో వెనుకబడిపోతున్నాం.
ఒక విశ్లేషణ ప్రకారం.. మన జీవిత కాలంలో దాదాపు 3వ వంతు నిద్రలోనే గడిచిపోతుంది. మరో 10 శాతం అలంకరణ, తయారీ, వ్యక్తిగత పనులకు వెచ్చిస్తున్నాం. ఇంకా కొంత సమయం కబుర్లు, సోషల్ మీడియా, నిరర్థకమైన కాలక్షేపానికి అర్పిస్తున్నాం. ఇలా చూస్తే మన జీవితంలోని దాదాపు 70 శాతం సమయం అనివార్య అవసరాలకే సరిపోతోంది. మిగిలిన 30 శాతం సమయాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నామన్నదే మన భవిష్యత్తును నిర్ణయిస్తోంది.
అనవసరమైన మాటలు, అవసరం లేని పనులను తగ్గించి, ఏకాగ్రతతో పనిచేస్తే అదే పరిమిత సమయంలో అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చని అనేక ఉదాహరణలు నిరూపిస్తున్నాయి. చిన్న చీమ నుంచి గొప్ప మేధావుల వరకు అందరూ సమయాన్ని తమ అత్యంత విలువైన సంపదగా భావించిన వారే. చీమ వేసవిలోనే శ్రమించి ఆహారాన్ని నిల్వ చేసుకుంటుంది. అలాగే మనిషి కూడా శక్తి, సమయం ఉన్నప్పుడే కష్టపడితేనే భవిష్యత్తులో భద్రత సాధ్యమవుతుంది.
పని, విశ్రాంతి మధ్య సమతుల్యత చాలా అవసరం. నిజమైన శక్తివంతులు రోజుకు 8 నుంచి 10 గంటల వరకు సమర్థవంతంగా పని చేయగలరని నిపుణులు చెబుతున్నారు. కానీ అతిగా శ్రమించడం వల్ల శారీరక, మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఎలా పనిచేయాలో తెలుసుకోవడంతో పాటు ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలో తెలుసుకోవడమే నిజమైన తెలివి. నిద్ర ప్రకృతి ఇచ్చిన వరం అయినప్పటికీ, దానికే పరిమితమైతే జీవితంలో పేదరికం, వెనుకబాటుతనం తప్పదని బైబిల్ వంటి గ్రంథాలు కూడా హెచ్చరిస్తున్నాయి.
మహనీయులు సమయంపై ఎన్నో విలువైన సందేశాలు ఇచ్చారు. సమయాన్ని వృధా చేసేవాడు తన జీవితాన్నే వృధా చేస్తున్నాడని బెంజమిన్ డిస్రేలి చెప్పిన మాట నేటికీ అక్షరసత్యం. డబ్బుతో వస్తువులను కొలిచినట్లు, మన పురోగతిని సమయంతో కొలవాలని ఆయన సూచించారు. మనం ఈ ప్రపంచంలో ఒక్కసారే జీవిస్తాం. కాబట్టి మనకు లభించిన సమయాన్ని నిర్లక్ష్యం చేయకుండా, మన కలలను నిజం చేసుకోవడానికి వినియోగించుకోవాలని మేధావులు హితవు పలికారు.
భారతదేశంలో సమయపాలన పట్ల మరింత గౌరవం పెరగాల్సిన అవసరం ఉంది. గడియారాన్ని గౌరవించడం అంటే జీవితాన్ని గౌరవించడమే. మన కాలాన్ని తెలివిగా ప్లాన్ చేసుకుంటే వ్యక్తిగత శ్రేయస్సుతో పాటు కుటుంబ ఆనందం, సామాజిక గుర్తింపు కూడా సాధ్యమవుతుంది. విజయానికి మార్గం ఒక్కటే అది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం.
ALSO READ: ఎలుకలు, పందికొక్కులతో ఇబ్బంది పడేవాళ్లు ఈ మొక్కలను పెంచితే చాలట!





