
Crime: చోడవరం పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడి ప్రజల మనసులను కలచివేసింది. ఆరు నెలల బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాదం ఊరినంతా శోకసంద్రంలో ముంచేసింది. కనకమహాలక్ష్మినగర్‌లో నివసిస్తున్న పోరెడ్డి వీణ (30) అనే మహిళ తన ఆరు నెలల పసిబిడ్డను చంపి, అనంతరం ఫ్యాన్‌కి చీరతో ఉరేసుకుని మృతి చెందింది. వీణ భర్త ఉమామహేశ్వరరావు బుచ్చెయ్యపేట మండలం కేపీ అగ్రహారం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇద్దరూ ప్రేమించి పెద్దల సమక్షంలో గత ఏడాది జనవరిలో వివాహం చేసుకున్నారు. అయితే వివాహానంతరం వారి మధ్య తరచూ కలహాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
బుధవారం ఉదయం భర్త పాఠశాలకు వెళ్లిన తర్వాత వీణకు ఫోన్ చేసినా స్పందించలేదని ఆయన తెలిపాడు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తలుపులు మూసి ఉండటంతో చుట్టుపక్కల వారితో కలిసి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్ళగా, ఫ్యాన్‌కి చీరతో ఉరి వేసుకున్న వీణ మృతదేహం కనిపించగా, పక్కనే మంచంపై ఆమె, ఆరు నెలల బాబు విగతజీవిగా పడి ఉన్నాడు. ప్రాథమిక విచారణలో తల్లి తన బిడ్డను తలగడతో నొక్కి చంపి, అనంతరం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం కుటుంబ కలహాలు, ముఖ్యంగా కట్నం సంబంధిత వేధింపులే ఈ విషాదానికి కారణమై ఉండవచ్చని అంటున్నారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అప్పలరాజు మాట్లాడుతూ.. “మృతురాలి తల్లిదండ్రులు చేరుకున్న తర్వాత పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తాం. భర్తను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నాం” అన్నారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, కుటుంబ సమస్యలు ప్రాణాలను బలి తీసుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు.
ALSO READ: టూరిజం మేనేజ్‌మెంట్‌లో పిహెచ్.డి. అందుకున్న దినేష్ కుమార్ గట్టు





