అంతర్జాతీయం

Trump Letter: నాకే నోబెల్ ఇవ్వరా? ఇక శాంతి గురించి ఆలోచించేది లేదన్న ట్రంప్!

ఇప్పటి వరకు ఎనిమిది యుద్ధాలను ఆపానని, అయినా తనకు నోబెల్ బహుమతి ఇవ్వలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఇక తాను శాంతి గురించి ఆలోచించేది లేదన్నారు.

అమెరికా అధ్యక్షుడిగా ఇప్పటి వరకు ఏకంగా 8 యుద్ధాలను ఆపినా, తనకు నోబెల్ బహుమతి ఇవ్వలేదని  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్‌కు ట్రంప్ ఓ లేఖ రాశారు. ఇకపై శాంతి గురించి మాత్రమే ఆలోచించాల్సిన అవసరం తనకు లేదని నిర్ణయించుకున్నానని ట్రంప్ లేఖలో వెల్లడించారు. తాజాగా ఆ లేఖ బయటకు లీక్ కావడంతో సంచలనం కలిగిస్తోంది.

ఇకపై శాంతి గురించి ఆలోచించను!

శాంతి ఎల్లప్పుడూ అత్యంత ముఖ్యమైనది అయినప్పటికీ, ఇకపై తాను ఆ దిశగా ఆలోచించనని ట్రంప్ తేల్చి చెప్పారు. అమెరికాకు ఏది ప్రయోజనకరమో దాని గురించి మాత్రమే తాను ఆలోచిస్తానని చెప్పారు. తనకు నోబెల్ బహుమతి రానందునే ప్రపంచ వ్యవహారాల పట్ల తన దృక్పథం మారిందని ఆ లేఖలో ట్రంప్ తెలిపారు. నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడం వల్ల కలిగిన నిరాశ నుంచే గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాన్ని ప్రారంభించానని ఆ లేఖ ద్వారా ట్రంప్ పరోక్షంగా అంగీకరించారని పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్ వెల్లడించింది.

ట్రంప్ నుంచి లేఖ వచ్చినట్లు నార్వే ప్రకటన

అటు అమెరికా అధ్యక్షుడి నుంచి తాను ఓ లేఖను అందుకున్నట్టు నార్వే ప్రధాన మంత్రి స్టోర్ వెల్లడించారు. నార్వే, ఫిన్లాండ్, ఇతర ఐరోపా దేశాలపై సుంకాలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్‌తో కలిసి తాను ట్రంప్‌నకు ఒక లేఖ పంపానని తెలిపారు. ఆ లేఖకు ప్రతిస్పందనగా ట్రంప్ తన అసంతృప్తిని వెల్లడించారని స్టోర్ తెలిపారు. ట్రంప్ నుంచి తనకు వచ్చిన లేఖలో ఉన్న విషయాలను ఆయన వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button