
Study Techniques: మన సమాజంలో పిల్లలు ఎంతగా చదివినా పరీక్షలకు వస్తే ఆశించినంతగా మార్కులు రాకపోవడం చాలా సాధారణం. తల్లిదండ్రులు పిల్లలను రోజంతా చదివిస్తే వారు క్లాస్‌లో ఫస్ట్ వస్తారని భావిస్తారు. కానీ నిజానికి పిల్లలు కేవలం ఎక్కువసేపు చదవడం వల్ల కాకుండా, సరైన పద్ధతిలో, తెలివిగా, ఆసక్తితో చదివితేనే మంచి ఫలితాలు సాధిస్తారు. చిన్నపిల్లల మనసు ఎంత సున్నితమో, అంతే వేగంగా బోర్ అయ్యే స్వభావం కూడా ఉంటుంది. అలాంటి సమయంలో నిరంతరం చదవమని ఒత్తిడి చేస్తే వారు చదువుపై ఆసక్తి కోల్పోయి చివరికి పాస్ మార్కులు మాత్రమే తీసుకురాగలరు.
పిల్లలు టాప్ మార్కులు సాధించాలంటే మొదట తల్లిదండ్రులే కొన్ని మార్పులు చేసుకోవాలి. చదువు, ఆడుకోవడం రెండు కూడా పిల్లలకు సమానంగా అవసరం. శారీరక కదలిక పిల్లల్లో కొత్త ఉత్సాహాన్ని కల్పిస్తుంది. అలాగే మెదడు తాజాగా పనిచేసి చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. అందుకే పిల్లల కోసం చదువు- ఆటల సమతుల్యమైన టైం టేబుల్ రూపొందించడం అత్యంత అవసరం. ఇందులో ఉదయం ఏ సమయానికి చదవాలి, మధ్యలో ఏ సమయానికి ఆడుకోవాలి, సాయంత్రం ఎంతసేపు రివిజన్ చేయాలి అన్న విషయాలను స్పష్టంగా ఉంచాలి.
చదవడం అంటే పిల్లలు గంటల గంటలు పుస్తకాల్లో మునిగిపోవడం కాదు. కొద్దిసేపు చదివి కొద్దిసేపు విరామం తీసుకునే పద్ధతి పిల్లల మెదడును చురుకుగా ఉంచుతుంది. 25 నిమిషాలు చదువు- 5 నిమిషాలు విరామం అనే టెక్నిక్ ప్రపంచవ్యాప్తంగా పిల్లల ఏకాగ్రత పెరగడానికి ఉపయోగపడే పద్ధతిగా గుర్తించబడింది. ఈ చిన్న విరామ సమయంలో పిల్లలు నడవడం, నీళ్లు తాగడం, కిటికీ బయట చూడడం వంటి లైట్ యాక్టివిటీస్ చేస్తే మెదడు రిఫ్రెష్ అవుతుంది.
నోట్స్ తీసుకోవడం అత్యంత కీలకం. పిల్లలు ఏ పాఠం చదివినా అందులోని ముఖ్యాంశాలను చిన్నచిన్న నోట్స్ రూపంలో రాయడం అలవాటు చేసుకోవాలి. ఇలా రాయడం వల్ల వారు ఆ విషయాన్ని లోతుగా అర్థం చేసుకుంటారు. పరీక్షల్లో కూడా ఈ నోట్స్ చాలా ఉపయోగపడతాయి. రాయడం, అర్థం చేసుకోవడం, తిరిగి రివిజన్ చేయడం .. ఈ మూడు కలిస్తే పిల్లలు గుర్తుంచుకునే సామర్థ్యం అనేక రెట్లు పెరుగుతుంది.
పిల్లలను ఎప్పుడూ గదిలో పెట్టి చదివించడం కూడా ఒక పెద్ద తప్పు. మూసివేసిన గది వారిని చికాకుగా మారేలా చేస్తుంది. అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్లి పార్కులో, లైబ్రరీలో, మ్యూజియంలో చదివిస్తే వారి కుతూహలం పెరుగుతుంది. ప్రత్యక్ష అనుభవం ద్వారా నేర్చుకున్న విషయాలు పిల్లలు ఎన్నటికీ మరచిపోరు. తల్లిదండ్రులు కూడా వారితో పాటు కూర్చొని కొంతసేపు చదవడం పిల్లలలో మరింత ప్రేరణను కలిగిస్తుంది.
పిల్లలు పరీక్షల్లో టాప్ మార్కులు తెచ్చుకోవాలంటే తల్లిదండ్రుల సహనం, పిల్లలపై నమ్మకం, సరైన టైం మేనేజ్‌మెంట్, చిన్న విరామాలు, నోట్స్ రాసే పద్ధతి, బయట అనుభవాలు.. ఇవన్నీ కలిసివస్తే మాత్రమే ఫలితం అధ్బుతంగా ఉంటుంది. ప్రేమతో, అర్థంతో, తెలివితో పిల్లలను మార్గనిర్దేశం చేస్తే వారు కేవలం పాస్ కాదు,.. అద్భుత ఫలితాలు సాధిస్తారు.
ALSO READ: Friday Rituals: శుక్రవారం ఉప్పుతో ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే.. డబ్బే డబ్బు!





