Sabarimala Temple Gold Row: శబరిమల ఆలయ బంగారం చోరీ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది. మూడు రాష్ట్రాల్లోని 21 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఆలయంలో ఏళ్ల తరబడి కొనసాగిన బంగారం చోరీ వరకే దర్యాప్తు పరిమితం కాలేదు. శబరిమలలోని ఇతర ఆలయ ఆస్తుల దుర్వినియోగంపైనా దర్యాప్తు జరుగుతోంది. భక్తులు సమర్పించిన కానుకల దుర్వినియోగం సహా శబరిమలలో ఆర్థిక అవకతవకలు, కుంభకోణాలు కూడా జరిగినట్టు ఈడీ దర్యాప్తు తెలియజేస్తోంది. సుదీర్ఘకాలంగా వివిధ స్థాయిల్లోని వ్యక్తులు కుమ్మక్కై ఈ వ్యవహారాలు నడిపినట్టు స్పష్టమవుతోంది. ఇందులో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధికారులు, ప్రైవేటు వ్యక్తులు, మధ్యవర్తులు, స్వర్ణకారుల నేరపూరిత కుట్ర ఉందని ఈడీ వెల్లడించింది.
బంగారాన్ని రాగి ప్లేట్లుగా..
శబరిమల బంగారం చోరీ వ్యవహారంలో ఈడీ ఈనెల 9న మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెల్లడవుతున్నాయి. బంగారం పూత పూసిన పవిత్ర కళాఖండాలను రికార్డుల్లో ఉద్దేశపూర్వకంగా రాగి పలకలుగా నమోదు చేశారు. వాటిని 2019-2025 మధ్య ఆలయ పరిసరాల నుంచి తొలగించారని ఈడీ తెలిపింది. చెన్నై, కర్ణాటకల్లోని ప్రైవేటు సంస్థల్లో బంగారాన్ని స్వాహా చేసినట్టు పేర్కొంది. ఈ వ్యవహారంలో ఎంతవరకు మనీలాండరింగ్ ఉందో నిర్ధారించేందుకు సోదాలు జరిపినట్టు ఈడీ తెలిపింది.
2019లోనే వెలుగులోకి..
బంగారం చోరీ వ్యవహారం తొలిసారిగా 2019లో వెలుగులోకి వచ్చినప్పటికీ, సుమారు రెండు దశాబ్దాలుగా కొనసాగుతుండొచ్చని ఈడీ వర్గాలు తెలిపాయి.2019లో 42.8 కిలోల బరువున్న బంగారు విగ్రహాలను మరమ్మతుల కోసం తీసుకెళ్లారు. వాటిని తిరిగి తీసుకొచ్చినప్పుడు వాటి బరువు 38.2 కిలోలే ఉంది. అంటే సుమారు 4.5 కిలోల బంగారాన్ని స్వాహా చేసేశారని ఈడీ వర్గాలు తెలిపాయి. విగ్రహాల పునః బంగారు తాపడం కోసం చెన్నైకి చెందిన ప్రైవేటు సంస్థకు అప్పగించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. కాగా, కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లోని మొత్తం 21 ప్రాంతాల్లో మంగళవారం ఈడీ సోదాలు నిర్వహించింది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి, టీడీబీ మాజీ అధ్యక్షుడు పద్మకుమార్ కు సంబంధించిన ప్రాంగణాల్లో ఈ సోదాలు జరిగాయి.





