దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా మోటార్ సైకిళ్లు నడుపుతారు. అయితే టూవీలర్స్ మీద ప్రయాణిస్తూ మరణిస్తున్న వాహనదారుల సంఖ్య ఆందోళనకరంగా ఉంది. ప్రభుత్వం వెల్లడించిన డాటా ప్రకారం 2019-2023 మధ్య 3.35 లక్షల మంది ద్విక్ర వాహనదారులు మరణించారు. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా మొత్తం ప్రమాదాల్లో 7.78 లక్షల మంది మృతి చెందినట్టు ఈ డాటా వెల్లడించింది.
ప్రతి ఏటా పెరుగుతున్న ప్రమాద మృతులు
ఒక పక్క దేశ వ్యాప్తంగా ద్విచక్ర వాహనాల వాడకం పెరుగుతుండగా, ప్రమాద మృతుల సంఖ్య కూడా పెరుగుతున్నది. కాగా, కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ డాటా ప్రకారం 2023లో జరిగిన మొత్తం రోడ్డు ప్రమాద మృతులలో 45 శాతం మంది ద్విచక్ర వాహనదారులే ఉన్నారు. అలాగే ఢిల్లీలోని నేషనల్ కేపిటల్ రీజియన్‌లో కూడా మొత్తం మృతులలో 38 శాతం మంది ద్విచక్ర వాహనాలు నడుపుతున్నవారేనని లెక్కలు చెబుతున్నాయి.
ఏప్రిల్ 1 నుంచి నగదు చెల్లింపులకు నో!
జాతీయ రహదారులపై గల టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులపై నిషేధం విధించేందుకు కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తున్నది. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. వాహనదారులు టోల్ చెల్లించేందుకు ఫాస్టాగ్, యూపీఐని ఉపయోగించవలసి ఉంటుంది. రోడ్లపై వాహనాలు బారులు తీరి ఉండటాన్ని నిరోధించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అధికారికంగా వెలువడలేదు. గడువు సమీపిస్తుండటంతో డిజిటల్ చెల్లింపులకు మారేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని వాహనదారులకు సలహా ఇస్తున్నారు. ఫాస్టాగ్, యూపీఐ చెల్లింపుల విధానం వల్ల ప్రయాణాలు వేగవంతమవుతాయి, ఇంధనం ఆదా అవుతుంది. పారదర్శకత వస్తుంది. చిల్లర, రశీదుల కోసం వేచి ఉండవలసిన అవసరం ఉండదు. మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో సిస్టమ్‌కు ఇది తొలి అడుగు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ దేశవ్యాప్తంగా 25 టోల్ ప్లాజాల వద్ద అమల్లో ఉంది.





