అంతర్జాతీయం

రైతుల ప్రయోజనాలే ముఖ్యం, ట్రంప్ టారిఫ్ లపై మోడీ కౌంటర్!

PM Modi On Trump Tariffs: భారత్‌పై అమెరికా విదిస్తున్న టారిఫ్ లపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలను తమపై విధించడంతో భారత్‌ దీటుగా స్పందించింది. తమ దేశంలోని రైతులు, మత్స్యకారులు, పాల ఉత్పత్తుల ప్రయోజనాలే ముఖ్యమని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు. అవసరమైతే ఆ భారాన్ని తామే భరిస్తామన్నారు.  తమ రైతుల ప్రయోజనాల విషయంలో ఎప్పటికీ రాజీ పడబోమని, దానికి ఎంత మూల్యమైనా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. ‘రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం. రైతులు, మత్స్యకారులు, డెయిరీ ఉత్పత్తిదారుల ప్రయోజనాల విషయంలో భారత్‌ ఎప్పటికీ రాజీ పడబోదు. వారిని కాపాడటం కోసం సుంకాల భారాన్ని సొంతగా భరించడానికీ సిద్ధం”  అని ప్రధాని స్పష్టం చేశారు.

మరో భారత్ పై అక్కసు వెళ్లగక్కిన ట్రంప్‌

రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందనే కారణంతో భారత్‌పై 50శాతం సుంకాలను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. మరోసారి బెదిరింపులకు దిగారు. మరిన్ని ఆంక్షలను చూస్తారంటూ హెచ్చరించారు. “భారత్‌పై మేం 50శాతం సుంకాలను విధించాం. ఆ దేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల్లో రెండో స్థానంలో ఉంది. భవిష్యత్తులో మరిన్ని ఆంక్షలను చూడబోతుంది” అన్నారు.

ట్రంప్ తీరుపై తీవ్ర విమర్శలు

భారతీయ ఉత్పత్తులపై 50శాతం సుంకాలను వేయడాన్ని ఇండియన్‌-అమెరికన్ల నేత, బైడెన్‌ మాజీ సలహాదారు అజయ్‌ భుటోరియా ఖండించారు. అమెరికాలో తక్కువ ధరలకు లభించే 50శాతం జనరిక్‌ మందులను భారత్‌ సరఫరా చేస్తోంది. ఈ సుంకాలు వాటి ధరలను పెంచుతాయన్నారు.  అమెరికాలోని కుటుంబాలు, సీనియర్‌ సిటిజన్లు, చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుస్తులు, పాదరక్షల, నిత్యవసరాల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు.

Read Also: అమెరికా చర్యలకు తగిన జవాబిస్తాం.. సుంకాల పెంపుపై భారత్ ఆగ్రహం!

Back to top button