
భారత్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో కకావికలమైన పాక్తిస్తాన్.. విష ప్రచారానికి దిగుతోంది. భారత విజయాన్ని జీర్ణించుకోలేక చిల్లర కూతలు కూస్తోంది. ఎల్‌ఓసీ దగ్గర కాల్పులకు తెగబడుతోంది. భారత్ సైనిక దళాలు సమర్థంగా తిప్పికొడుతుండడంతో.. తప్పుడు ప్రచారం చేస్తూ శునకానందం పొందుతోంది. పాత ఫోటోలు, వీడియోలను.. తాజా ఘటనలుగా చూపిస్తూ అసత్య కథనాలను ప్రచారం చేస్తోంది.
లేనిది ఉన్నట్లు.. జరగనిది జరిగినట్లు.. ప్రమాదవశాత్తూ జరిగిన దాన్ని తామే చేశామన్నట్లు పాక్ కలరింగ్ ఇస్తోంది. పాక్ పౌరులతో పాటు అంతర్జాతీయ సమాజానికి తానే ‘హీరో’ అనే చెప్పుకొనే ప్రయత్నం చేస్తోంది. కానీ భారత ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ విభాగం.. అసత్య ప్రచారాన్ని ఆధారాలతో సహా నిరూపిస్తూ పాకిస్తాన్ గాలి తీసేస్తోంది.
భారత రఫేల్ జెట్‌ను కూల్చివేశామని ఓ ఫొటో వైరల్ చేశారు పాకిస్తాన్ అధికారులు. కానీ అది 2021లో పంజాబ్‌లో కూలిన మిగ్-21 ఫొటో అని PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది.
జమ్మూకశ్మీర్ ఎయిర్ బేస్ మీద పాక్ దాడులు జరిపిందంటూ పాక్ అనుకూల ఎక్స్ ఖాతాల్లో కొన్ని పోస్టులు కనిపించాయి. వాస్తవానికి అఫ్గానిస్థాన్‌లోని కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో 2021 ఆగస్టులో జరిగిన పేలుడు ఫొటోను ఇందుకు వినియోగించినట్లు పీఐబీ నిరూపించింది.
గుజరాత్‌లోని హజారియా పోర్టుపై పాకిస్థాన్ దాడి చేసిందంటూ మరో ప్రచారాన్ని పాక్ తెరపైకి వచ్చింది. వాస్తవానికి 2021 జులై 7న ఆయిల్ ట్యాంకర్ పేలుడు ఘటన వీడియోను తన ఫేక్ ప్రచారానికి వాడేసుకుంది.
2020లో బీరుట్‌లో జరిగిన పేలుడు ఘటనను కూడా తమ అసత్య ప్రచారానికి వాడుకుంది. పాకిస్థాన్ క్షిపణి దాడులకు సంబంధించిన వీడియో అంటూ పేర్కొనగా.. దాన్ని ఆధారాలతో భారత్ తిప్పికొట్టింది. ఆఖరికి వీడియో గేమ్స్‌లోని వీడియోలను కూడా పాక్ వదలడం లేదు.