
First woman SPG officer Adaso Kapesa: ప్రధాని మోడీ రక్షణ బాధ్యతలను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(SPG) చూసుకుంటుంది. ఈ టీమ్ లోని సభ్యులు మెరికల్లా వ్యవహరిస్తారు. బుల్లెట్ క్యాచర్స్ గా పిలిచి వీరు, అవసరమైతే తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రధాన మంత్రిని కాపాడుకుంటారు. ఈ గ్రూప్ లో చేరేందుకు కఠినమైన శిక్షణ ఇస్తారు. ఇప్పటి వరకు ఎస్పీజీలో కేవలం పురుషులు మాత్రమే ఉండగా, తొలిసారి ఓ మహిళా కమాండో చేరింది. రీసెంట్ గా ప్రధాని మోడీ యూకే పర్యటనలో ఆమె హైలెట్ అయ్యింది. ప్రధాని వెనుక నిలబడి ఫోటోల్లో కనిపించింది. ప్రస్తుతం ఆమె గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.
ఇంతకీ ఎవరా మహిళా ఎస్పీజీ కమాండో?
అమె పేరు అదాసో కపెసా. భారత ప్రధాని వ్యక్తిగత భద్రతా విభాగం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ లో చేరిన తొలి మహిళా అధికారిగా ఆమె గుర్తింపు పొందారు. 1885లో ఏర్పాటైన ఎస్పీజీలో ఓ మహిళా అధికారి అడుగు పెట్టడం ఇదే తొలిసారి. మణిపుర్ లోని సేనాపతి జిల్లా కైబీ గ్రామానికి చెందిన కపెసా ప్రస్తుతం ఎస్పీజీలో డిప్యుటేషన్ పై పని చేస్తున్నారు. అంతకుముందు ఆమె సశస్త్ర సీమా బల్ లో చేరి 55వ బెటాలియన్ లో ఉత్తరాఖండ్ లోని పిథోర్ గఢ్ లో సేవలందించారు. ఓ మారుమూల గ్రామం నుంచి ఎస్పీజీలో అధికారిగా ఎదిగిన కపెసా ప్రయాణం తన వ్యక్తిగత విజయం మాత్రమే కాకుండా తనలాంటి ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.